శ్రీశైలం కరెంటుకు ఆంధ్రా అడ్డుపుల్ల

శ్రీశైలం కరెంటుకు ఆంధ్రా అడ్డుపుల్ల
  • లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌లో కరెంట్‌ ఉత్పత్తి 
  • ఆపాలంటూ బోర్డుకు లేఖలు
  • శ్రీశైలం కట్టిందే జల విద్యుత్‌ కోసం.. 
  • కానీ అందుకు విరుద్ధంగా వాదనలు
  • రాయలసీమకు నీళ్లు అందడం లేదని గగ్గోలు
  • ఏపీకే వంత పాడుతున్న కృష్ణా బోర్డు

హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టుపై గుత్తాధిపత్యం కోసం ఏపీ కుట్రలు చేస్తోంది. రిజర్వాయర్‌ కట్టిందే జల విద్యుత్‌ ఉత్పతి కోసమన్న విషయాన్ని తొక్కి పెట్టి రాయలసీమకు నీళ్లు అందడం లేదని గగ్గోలు పెడుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నీళ్లు వాడుకుని తెలంగాణ అక్రమంగా కరెంట్‌ ఉత్పత్తి చేస్తోందని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తోంది. డ్యాం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా కృష్ణా బోర్డు కూడా ఏపీకే వంత పాడుతోంది. శ్రీశైలంలో కరెంట్‌ ఉత్పత్తిపై వరుసగా రెండో ఏడాది విషం చిమ్ముతున్న ఏపీ.. కరెంట్‌ ఉత్పత్తి తర్వాత విడుదల చేసే నీటిని రెండు రాష్ట్రాలకు నీళ్లిచ్చే నాగార్జునసాగర్‌లోకి విడుదల చేస్తున్నారనే నిజాన్ని బయటకు చెప్పడం లేదు. ఆ నీళ్లన్నీ తెలంగాణే ఉపయోగించుకుంటోందనే రీతిలో తప్పుడు ప్రచారం చేస్తోంది.

ఏపీ లెటర్లు.. ఆ వెంటనే బోర్డు లెటర్లు..

ఈ ఫ్లడ్‌ సీజన్‌ ప్రారంభంలోనే కృష్ణా నదికి ఎగువ నుంచి మంచి ప్రవాహాలు వస్తున్నాయి. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు దాదాపు నిండాయి. జూరాల ఇప్పటికే నిండింది. తుంగభద్రకూ ప్రవాహాలు ఆశాజనకంగానే ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌కు తక్కువ సమయంలోనే భారీ వరదలు వచ్చే అవకాశముండటంతో టీఎస్‌ జెన్‌ కో శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌లో ఈనెల రెండో తేదీన కరెంట్‌ ఉత్పత్తి ప్రారంభించింది. మొదట్లో వెయ్యి క్యూసెక్కులు, అంతకు కొంత ఎక్కువ నీళ్లను మాత్రమే కరెంట్‌ ఉత్పత్తికి ఉపయోగించి, ఆ నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేసింది. అయితే లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌లో కరెంట్‌ ఉత్పత్తి ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం ఈనెల 10న కేఆర్‌ఎంబీకి లేటర్‌ రాసింది. 

దీనిపై వెంటనే స్పందించిన బోర్డు మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే.. కరెంట్‌‌ ఉత్పత్తి ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తిపై ఈ నెల 24న ఏపీ ప్రభుత్వం రెండోసారి కృష్ణా బోర్డుకు మళ్లీ ఫిర్యాదు చేసింది. రాయలసీమకు సాగు, తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ ద్వారా నీటిని తీసుకోవడానికి శ్రీశైలంలో 854 అడుగులు ఉండాలని, అప్పుడు తాము 7 వేల క్యూసెక్కులు తీసుకోగలమని బోర్డుకు ఏపీ వివరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆ లెవల్‌‌లో నీటి మట్టం మెయింటైన్‌‌ చేయకుండా కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తోందని అభ్యంతరం తెలిపింది. నిజానికి పవర్‌‌ జనరేషన్‌‌ ద్వారా శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటిని నాగార్జునసాగర్‌‌లోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌ వరకు మధ్యలో తెలంగాణ ఎక్కడా చుక్కా నీటిని కూడా వినియోగించుకునే అవకాశం లేదు. సాగర్‌‌లోనూ కుడి, ఎడమ కాలువల ద్వారా ఏటా ఎక్కువ నీటిని ఏపీనే ఉపయోగించుకుంటోంది. అయినా కరెంట్‌‌ ఉత్పత్తిపై అక్కసు వెళ్లగక్కుతోంది.

ఫిర్యాదుల మీద ఫిర్యాదులు

కృష్ణా బోర్డుకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, సెక్రటరీలు మాత్రమే లెటర్‌‌ రాయాల్సి ఉంటుంది. వాళ్ల లేఖలు, ఫిర్యాదులపైనే బోర్డు స్పందించాలి. కానీ 2020 జూన్‌‌ 19న కర్నూల్‌‌ ఎస్‌‌ఈ.. తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తిపై బోర్డుకు లేఖ రాశారు. బోర్డు చైర్మన్‌‌, మెంబర్‌‌ సెక్రటరీలకు ఏపీ ఈఎన్సీ వాట్సప్‌‌ మెసేజ్‌‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కరెంట్‌‌ ఉత్పత్తి ఆపేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ తెలంగాణకు లేఖ రాశారు. వారం రోజుల వ్యవధిలోనే ఏపీ ఈఎన్సీ మళ్లీ ఫిర్యాదు చేయగా.. 30న మరోసారి అవే ఆదేశాలిచ్చారు. పైగా తెలంగాణ ఆదేశాలను ఉల్లంఘించి కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తోందని ఆగస్టు 3న జలశక్తి శాఖకు  బోర్డు ఫిర్యాదు చేసింది.

350 టీఎంసీలు నిల్వ చేసుకునేలా..

ఎన్టీఆర్‌‌ సీఎం అయ్యాక చెన్నైకి తాగునీటి కోసమంటూ శ్రీశైలానికి బొక్క పెట్టారు. రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున చెన్నై తాగునీటికి మొత్తం 15 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది. తర్వాత కరువు పీడిత రాయలసీమలో 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని శ్రీశైలం రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌ (ఎస్‌‌ఆర్బీసీ)ను తెరపైకి తెచ్చారు. రోజుకు 1,500 క్యూసెక్కులు తీసుకోవాల్సి ఉన్నా.. 11,500 క్యూసెక్కులు తీసుకునేలా పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నిర్మించారు. దీని ఆధారంగానే గాలేరు నగరి ప్రాజెక్టు చేపట్టారు. వైఎస్‌‌ సీఎంగా ఉన్నప్పుడు 44 వేల క్యూసెక్కులు తరలించేలా కొత్త హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నిర్మించారు. దీనికి అదనంగా హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్టులు నిర్మించారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీ 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారు. కొత్తగా సంగమేశ్వరం పేరుతో రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే పనులు కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచే 350 టీఎంసీలు నిల్వ చేసుకునేలా ఏపీ ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు నీళ్ల కోసం కరెంట్‌‌ ఉత్పత్తిని ఆపించేందుకు రిజర్వాయర్‌‌ ప్రొటోకాల్‌‌నే మార్చేలా లాబీయింగ్‌‌ చేస్తోంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా సమర్థంగా తిప్పికొట్టడం లేదు.