
తిరుమల పరకామణి చోరీ కేసు ఏపీలో పెను దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో పోలీసు శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.లోక్ అదాలత్ లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించి రికార్డులు సీజ్ చేయాలన్న ఆదేశాలు పట్టించుకోలేదంటూ మండిపడింది హైకోర్టు. పరకమణిలో అక్రమాలు జరుగుతుంటే పోలీసు శాఖ నిద్రపోతోందా.. ? సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరిస్తున్నారా అంటూ మండిపడింది కోర్టు. ఈ క్రమంలో సీఐడీ డీజీకి కీలక ఆదేశాలు జారీ చేసారు హైకోర్టు జడ్జి.
హైకోర్టు ఆదేశాలతో పరకామణి చోరీ కేసు విచారణ ప్రారంభించింది సీఐడీ. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించింది సీఐడీ బృందం. ఈ కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్ పోలీసుస్టేషన్ లో రికార్డులను పరిశీలించారు అధికారులు.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 19న పరకామణి చోరీ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ వ్యవహారానికి సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను పోలీసు శాఖ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసు శాఖ నిద్రపోతోందని, రాష్ట్రంలో పోలీసు శాఖను మూసివేయడమే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు.