కొండాపూర్ రేవ్ పార్టీలో ట్విస్ట్.. కారుపై ఏపీ ఎంపీ స్టిక్కర్ లోగుట్టు ఇదే

కొండాపూర్  రేవ్ పార్టీలో ట్విస్ట్.. కారుపై  ఏపీ ఎంపీ స్టిక్కర్  లోగుట్టు ఇదే

హైదరాబాద్ కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్. జులై 27న స్వాధీనం చేసుకున్న ఫార్చునర్ కారుకి ఉన్న  ఎంపీ స్టిక్కర్ ఫేక్ గా గుర్తించారు పోలీసులు.  టోల్ గేట్ల దగ్గర ఫీజు కట్టకుండా  తప్పించు కునేందుకే నిందితుడు అశోక్.. కారుకి ఎంపీ స్టిక్కర్ పెట్టుకున్నట్లు చెప్పారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ కేసులో ఎంపీ స్టిక్కర్ ఉండటంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే నిందితుడికి ఏమైనా రాజకీయ సంబంధాలున్నాయా అనే కోణంలో ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది.

 జులై 26న  ఐటీ కారిడార్​​లో వీకెండ్ రేవ్​పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన కొందరు వ్యక్తులు ​కొండాపూర్​ జేవీజీ హిల్స్​లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్​మెంట్​​లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. 9 మందిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారయ్యారు. వీరి నుంచి 2.08 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్, 1.91 గ్రాముల చరస్, 4 ఎల్ఎస్డీ బ్లాట్స్, 4 కార్లు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

ALSO READ : హైదరాబాద్ సిటీలో రూ.5 కోట్ల గంజాయి పట్టివేత : ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..! 

ఏపీకి చెందిన ఓ ముఠా అక్కడి యువతులను  ప్రతి వీకెండ్​లో సిటీకి తీసుకొచ్చి, రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్​ఎస్ఐ సంధ్య బాలరాజు తెలిపారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు కలిసి ఈ పార్టీని  నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వీరు ఫేక్ ఐడీలతో అపార్ట్​మెంట్​ బుక్ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో రాహుల్, ఉన్నటి ఎమ్మన్యూల్ అలియాస్ ప్రవీణ్, అశోక్ నాయుడు, సమ్మెల సాయి కృష్ణ, నాగేళ్ల లీల మణికంఠ, హిల్టన్ జోసెఫ్, యశ్వంత్ శ్రీదుత్త, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజ ఉండగా, శ్రీనివాస్ చౌదరి, అఖిల్​పరారయ్యారు. వీరంతా మంగళగిరి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.