శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ రిపేర్లపై ఏపీ నిర్లక్ష్యం..రెండేండ్లుగా క్రస్ట్‌‌ గేట్ల నుంచి వాటర్‌‌ లీకేజీ

శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ రిపేర్లపై ఏపీ నిర్లక్ష్యం..రెండేండ్లుగా క్రస్ట్‌‌ గేట్ల నుంచి వాటర్‌‌ లీకేజీ
  • పనులు మొదలు పెట్టేలోపే ప్రాజెక్టుకు వరద
  • అటు ప్లంజ్​పూల్‌‌ పనులకూ ఆటంకాలు

మహబూబ్‌‌నగర్‌‌/శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ నిర్వహణను ఏపీ సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. కొన్ని రోజులుగా ప్రాజెక్ట్‌‌ క్రస్ట్​గేట్ల నుంచి నిరంతరాయంగా వాటర్‌‌ లీకవుతోంది. లీకేజీలను అరికట్టేందుకు ఈ సారి రిపేర్లు ఆలస్యంగా ప్రారంభించడం, ఆ లోగా వరదలు రావడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీనివల్ల ప్రస్తుతం లీకేజీలు ఎప్పట్లాగే కొనసాగుతుండగా పెద్ద మొత్తంలో నీరు దిగువకు వెళ్లిపోతోంది. మరోవైపు గేట్ల దిగువన గొయ్యి మరింత పెద్దదవుతున్నా, వాటి పనులు కూడా పెండింగ్​పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. 

రెండేండ్ల నుంచి లీకేజీలు

రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్​నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు, శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ నిర్వహణ బాధ్యతలు ఏపీకి కేంద్రం అప్పగించింది. కానీ శ్రీశైలం రిపేర్లపై ఏపీ నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 12 గేట్లు ఉండగా.. మొదటి గేటు, 12వ గేటును కొన్నేండ్లుగా తెరవడం లేదు. వీటిని ఓపెన్‌‌ చేస్తే తెలంగాణ, ఏపీ వైపు ఉన్న జల విద్యుత్‌‌ కేంద్రాలకు ముప్పు ఏర్పడుతుందని బంద్‌‌ పెట్టారు. 

 

ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ ఆధారంగా 2వ గేటు నుంచి వరుసగా 11వ గేటు వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కానీ రెండేండ్ల నుంచి ప్రాజెక్ట్‌‌కు ఉన్న క్రస్ట్​గేట్ల ద్వారా నీరు లీకవుతూనే ఉంది. ఈ సమస్య 2, 3, 4, 5,10,11వ గేట్ల వద్ద ఉండగా.. కొన్ని రోజులుగా 3, 10వ గేట్ల వద్ద సమస్య తీవ్రమైంది. గేట్ల నుంచి చిన్న కాలువలను తలపించేలా నీరు లీకవుతోంది. లీకేజీలను అరికట్టడానికి గేట్ల వద్ద రబ్బర్‌‌ సీల్స్‌‌, వేజ్‌‌ ప్లేట్స్‌‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. 

వీటిని వేసేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది రూ.1.39 కోట్లను కేటాయించగా.. ఈ ఏడాది వేసవి చివర్లో పనులు ప్రారంభించారు. కానీ ఆ లోగానే ప్రాజెక్టుకు వరద మొదలైంది. జూలై నుంచి నిరంతరాయంగా ఫ్లడ్‌‌ వస్తూనే ఉండడంతో పనులు ముందుకు సాగలేదు. కేవలం మూడు గేట్లకు మాత్రమే రబ్బర్ సీల్స్, వేజ్​ప్లేట్స్‌‌ వేసి వదిలేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌‌ నిండుకుండలా ఉండడంతో 3,10వ గేట్ల నుంచి నీరు నిరంతరాయంగా బయటకు వెళ్తోంది.

ప్లంజ్​పూల్​ పనులకూ ఆటంకం

2009లో వచ్చిన వరదలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ దిగువన పెద్ద గొయ్యి (ప్లంజ్‌‌ పూల్)​ ఏర్పడింది. అది క్రమంగా పెద్దదవుతూ క్రస్ట్ గేట్ల వరకు విస్తరిస్తోంది. దీనికి రిపేర్లు చేసేందుకు ఈ ఏడాది జూన్‌‌ 10న విశాఖపట్నానికి చెందిన చెందిన ‘సీ లయన్‌‌ ఆఫ్‌‌ షోర్‌‌ డైవింగ్’ అనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో 14 మంది సభ్యులు అండర్‌‌ వాటర్‌‌ వీడియోగ్రఫీ తీశారు. ప్లంజ్​పూల్‌‌ పరిస్థితిని చిత్రీకరించి డ్యామ్‌‌ ఆఫీసర్లు, ఏపీ ప్రభుత్వానికి రిపోర్టును అందించారు. అక్కడి ప్రభుత్వం కూడా అవసరమైన నిధుల కోసం అంచనాలు రూపొందించి, ప్రైవేట్​లిమిటెడ్​ఇచ్చిన రిపోర్టును జత చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.

 కేంద్రం కూడా నిధుల విడుదలకు హామీ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం మొదట ప్లంజ్‌‌ పూల్‌‌ వరకు వాహనాలు వెళ్లేందుకు కోసం అప్రోచ్‌‌ రోడ్డు వేసేందుకు రూ.33 కోట్లతో టెండర్లను పిలువగా.. ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ ఉన్నట్లుండి భారీ వర్షాలు పడడం, ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండడంతో పనులను ఆపేశారు. వరద తగ్గుముఖం పట్టాక పనులు ప్రారంభించేందుకు ప్రయత్నం చేయగా.. పెద్ద మొత్తంలో నీరు లీకేజీ అవుతుండడంతో ఈ పనులు కూడా ముందుకు సాగడం లేదు.

రికార్డు స్థాయిలో వరద

ఈ సంవత్సరం మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణ, తుంగభద్ర నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చింది. మొదటి సారి మే 29న ప్రాజెక్ట్‌‌కు ఇన్‌‌ ఫ్లో మొదలై రెండు రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత మధ్యలో కొన్న రోజుల గ్యాప్​తర్వాత జులై నుంచి జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు వరద కంటిన్యూగా వచ్చింది. 

ఆ టైంలో ప్రాజెక్టు కెపాసిటీ 37 టీఎంసీలు మాత్రమే ఉండగా.. రెండు వారాల్లోనే ఫుల్‌‌ కెపాసిటీకి చేరుకుంది. ప్రాజెక్టుకు అత్యధికంగా గత నెలలో వారం, పది రోజుల పాటు మూడు లక్షల కూసెక్కుల చొప్పున ఇన్‌‌ఫ్లో వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌‌కు ఇప్పటివరకు 1,380 టీఎంసీల నీరు వచ్చినట్లు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.