గంజాయి సప్లయ్ చేస్తూ దొరికిన ఏపీ పోలీస్

గంజాయి సప్లయ్ చేస్తూ దొరికిన ఏపీ పోలీస్
  •     ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్ 
  •     రూ.8 లక్షల విలువైన 22 కిలోల సరుకు స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు :  గంజాయి సప్లయ్ చేస్తున్న ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్​ను  బాలానగర్ ఎస్​వోటీ, బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయనగరానికి చెందిన ఉరికి సాగర్ పట్నాయక్(32) ఏపీఎస్పీ కాకినాడ థర్డ్​ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్​గా, తుని ప్రాంతానికి చెందిన పి. శ్రీనివాస్(35) కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు.

ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఇద్దరూ కలిసి జీడిపప్పు వ్యాపారం చేశారు. అందులో నష్టాలు రావడంతో గంజాయి సప్లయ్ చేయడం మొదలుపెట్టారు. గురువారం అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నుంచి 22 కిలోల గంజాయిని జీడిపప్పు మధ్యలో దాచి కారులో సిటీకి తీసుకొచ్చారు.

శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రగతినగర్ కమాన్ వద్ద బాలానగర్ ఎస్ వోటీ, బాచుపల్లి పోలీసులు వీరి కారును పట్టుకున్నారు. రూ.8 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాగర్ పట్నాయక్,  శ్రీనివాస్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.