శ్రీశైలం రిపేర్ల బాధ్యత ఏపీదే

శ్రీశైలం రిపేర్ల బాధ్యత ఏపీదే
  •     ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలనిరాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  •     శ్రీశైలం ప్రాజెక్టు ఏపీఆధీనంలోనే ఉన్నది
  •     దాని రిపేర్లతో తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేయనున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు :  శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకు దిగువన ఏర్పడిన ప్లంజ్ పూల్ (భారీ గుంత)ను పూడ్చే బాధ్యత ఏపీదేనని చెప్తూ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌‌‌‌ఏ)కి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రిపేర్లకు ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని ఇంజినీర్లను ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ఆధీనంలో ఉందని, అలాంటప్పుడు దాని రిపేర్లతో తెలంగాణకు సంబంధం లేదని లేఖలో పేర్కొననున్నారు.

నాగార్జున సాగర్ స్పిల్​వేలో లోపాల రిపేర్లను తెలంగాణ సొంత ఖర్చులతో చేస్తున్నదని, అలాంటప్పుడు ఏపీ నిర్వహణలో ఉన్న శ్రీశైలం రిపేర్లను ఆ రాష్ట్రమే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేయనున్నారు. 2009 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో, ఆ తర్వాత వచ్చిన భారీ వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌‌‌‌కు దిగువన 40 మీటర్ల లోతు భారీ గుంత ఏర్పడింది. దాన్ని పూడ్చకపోతే ప్రాజెక్టుకే ప్రమాదమని గతంలో కేఆర్ఎంబీ తేల్చిచెప్పింది.

ప్లంజ్ పూల్‌‌‌‌ను పూడ్చేందుకు రూ.800 కోట్లు అవసరమవుతాయని తమ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు అప్పటి కేఆర్ఎంబీ సభ్యుడు, డ్యాం సేఫ్టీ ఎక్స్‌‌‌‌పర్ట్ రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని కమిటీ శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్​ప్రాజెక్టును పరిశీలించి రెండు ప్రాజెక్టుల్లోని లోపాలపై నివేదిక ఇచ్చింది.

‘డ్రిప్’ నిధులు పోగా మిగతావి భరించాలి

డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌‌‌‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా వరల్డ్ బ్యాంక్ నిధులతో శ్రీశైలం రిపేర్లు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ‘డ్రిప్’ కింద అందించే సాయం పోగా మిగతా మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరించేలా కేంద్రం చొరవ చూపాలని లేఖలో ప్రస్తావించనున్నారు. మహారాష్ట్రలోని కొయినా డ్యాం నుంచి వంద టీఎంసీల నీటిని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. దీనిలో సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలని నిర్ణయించారు.

కోయినా నుంచి తీసుకునే వంద టీఎంసీల నీటిని కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల మీద జూరాలకు తీసుకురావాల్సి ఉంటుంది. వెయ్యి కి.మీ.లకు పైగా దూరం నుంచి నీటి తరలింపులో అనేక ఇబ్బందులు ఉన్నాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో టెక్నికల్​కమిటీ నీటి తరలింపు సాధ్యమా లేదా అనేది నిర్ణయించనున్నారు.