Galla Jayadev: రాజకీయాల నుంచి తప్పుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

Galla Jayadev: రాజకీయాల నుంచి తప్పుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాబోవు 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

వ్యాపారవేత్తలు రాజకీయాల్లో వస్తే స్వేచ్ఛంగా మాట్లాడే అవకాశం ఉండాలన్న గల్లా జయదేవ్, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. కాదని ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వ్యాపార సంస్థలపై నిఘా పెడుతున్నారంటూ పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ మౌనంగా ఉండలేనని, ఈ క్రమంలోనే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.


"ప్రస్తుతానికి రాజకీయాల నుంచి వైదొలగుతున్నాను. వచ్చే ఎన్నికల్లో నిలబడితే తప్పక గెలుస్తాను. కానీ, పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా.. చేయను. 10 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశాను. తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యాను. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు.. గత మూడేళ్ళుగా నేను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేను. అయినప్పటికీ పార్లమెంట్‌ పరిధిలో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నాను. రెండేళ్ల క్రితం నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆ బాధ్యత నాదే. ఇకపై వ్యాపారాలపై ద్రుష్టి పెడతాను. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా. అవకాశం వస్తే రాజకీయాల్లో మళ్లీ వస్తాను.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మంచిగా ఉంటే బాగుండేది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.." అని గల్లా జయదేవ్ తన చివరి రాజకీయ ప్రసంగంలో మాట్లాడారు.

టీడీపీ తరపున గుంటూరు నుంచి రెండు సార్లు పోటీచేసి గెలిచిన గల్లా రాజకీయాల నుంచి తప్పుకోవటంతో.. రాబోవు ఎన్నికల్లో అక్కడ్నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీలో ఉంటారనేది ఆసక్తకిరంగా మారింది.