జస్టిస్ ఫర్ పీఆర్సీ అంటూ టీచర్ల ఆందోళన

జస్టిస్ ఫర్ పీఆర్సీ అంటూ టీచర్ల ఆందోళన
  • జీఓలు జారీ లోపు చర్చ లకు ఆహ్వానించాలి
  • గతంలో ఏ పీఆర్సీ లో లేని సంప్రదాయాలను 11వ పీఆర్సీలో తెచ్చారు
  • మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలి: పీఆర్సీ కన్వేయింగ్ కమిటీ

అమరావతి: గతంలో ఏ పీఆర్సీ లో లేని సంప్రదాయాలను 11వ పీఆర్సీలో తెచ్చారని.. ఉపాధ్యాయుల ఆందోళన..నిరసనలను ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని పీఆర్సీ కన్వేయింగ్ కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జస్టిస్ ఫర్ పి. ఆర్.సి ఆధ్వర్యంలో నిర్దేశించిన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15 నుండి 20 వరకు ఉపాధ్యాయులు / ఉద్యోగుల నుండి సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించే కార్యక్రమం చేపట్టారు. సంతకాల సేకరణకు ఇవాళ చివరి. ఈ సందర్భంగా పోస్ట్ ద్వారా వినతి పత్రాలను సీఎం కు పంపే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  కన్వేయింగ్ కమిటి సభ్య సంఘాలు ఎస్టీయూ,యూటీఎఫ్, ఏపీటీఎఫ్ -257, ఏపీటీఎఫ్ - 1938, ఏపీపీటీఏ, ఎస్ఏఏ, రాష్ట్ర, జిల్లా నాయకత్వాల ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరికొన్ని సంఘాలు పాల్గొని మద్దతు ప్రకటించాయి. 
11వ PRCలో ప్రభుత్వం గత పది పీఆర్సీల్లో లేని సంప్రదాయాలను తెచ్చిందని జి. వో లు జారీ చేసేలోపు సరిచేయాలని జస్టిస్ ఫర్ PRC రాష్ట్ర కన్వెయింగ్ కమిటి సభ్యులు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు, ఏపీపీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు, ఎస్టీయూ రాష్ట్ర సహద్యక్షులు హెచ్. తిమ్మన్న, యూటీఎఫ్ రాష్ట్ర సహధ్యక్షులు కె.సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 11వ PRC  13 లక్షల మంది వేతన జీవులకు అసంతృప్తి, నిరాశను కల్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు.  సంబంధిత ఉత్తర్వులు జారీ కాకముందే ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఐ ఆర్ కు సమానంగా 27 శాతం ఫిట్మెంట్, పదవీ విరమణ చేసిన వారికి మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 2020 నుండి గ్రాట్యుటీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే  CPS రద్దు చేయాలని, కాంట్రాక్ట్, సచివాలయం ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ప్రకారం జీతాలు పెంచాలని  కోరారు. జస్టిస్ ఫర్ పీఆర్సీ వేదిక నాయకత్వాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి న్యాయం చేయాలని కోరారు.