
ఒకవైపు బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు నిర్మాణం కోసం కొత్తగా ఒక ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కంపెనీల చట్టం 2013 ప్రకారం.. బనకచర్ల నిర్మాణం కోసం ఏపీ ‘జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్’ పేరున ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసింది. విజయవాడ కేంద్రంగా ఈ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరద జలాల నిర్వహణ, పోలవరం - బనకచర్ల నిర్మాణం, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఈ కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
►ALSO READ | ఏపీ బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన నిర్ణయం : న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రి ఉత్తమ్
బనకచర్ల ప్రాజెక్టుపై అన్ని అధ్యయనాలు చేసిన తర్వాత ఈ కార్పోరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అండర్ లో జలహారతి కార్పోరేషన్ ను విజయవాడలో ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ కు ఉత్తర్వులు జారీ చేసింది.
బనకచర్ల నిర్మాణం అక్రమమని.. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటిస్తున్న సందర్భంలో ఏపీ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.