ఏపీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం

ఏపీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం
  • నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ క్లీన్ స్వీప్
  • చంద్రబాబు కంచుకోట కుప్పంలో కుప్పకూలిన తెలుగుదేశం
  • కృష్ణా జిల్లా కొండపల్లిలో టై.. కీలకంగా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి 
  • కొండపల్లిలో  వైసీపీకి 14,టీడీపీకి 14, ఇండిపెండెంట్ 1

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. వివిధ కారణాలతో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన నెల్లూరు కార్పొరేషన్ తోపాటు.. 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు పలు మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డు స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధించినా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఆ పార్టీకి చేదు అనుభవం మిగిల్చింది. అలాగే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ చెరి సమానంగా వార్డులు గెలుచుకోవడంతో టై అయింది. దీంతో ఇక్కడ గెలిచిన ఏకైక ఇండిపెండెంట్ అభ్యర్థి మొగ్గు కీలకంగా మారింది. నెల్లూరు కార్పొరేషన్‌లో ఉన్న 54 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. నామినేషన్ల పర్వంలోనే 8 డివిజన్లను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ ఆ తర్వాత పోలింగ్ లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. నెల్లూరు జిల్లా చరిత్రలో తొలిసారిగా అన్ని ప్రతిపక్షం లేకుండా కార్పొరేషన్లోని అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అలాగే  చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ వైఎస్సార్‌సీపీ ఘన విజయాన్ని సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో 25 స్థానాలు ఉండగా.. అధికార  వైసీపీ అభ్యర్థులు 19 చోట్ల విజయం సాధించగా టీడీపీ 6 స్థానాల్లో గెలుపొందింది. 
మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు ఇవే
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా నందికొట్కూరు, బేతంచెర్ల, కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోని దర్శి మినహా అన్ని మున్సిపాలిటీలను, నగర పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. 
ప్రకాశం జిల్లాలో వైసీపీకి చుక్కెదురు
స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనివినీ ఎరుగని రీతిలో భారీ విజయం సాధించిన వైసీపీకి ప్రకాశం జిల్లాలో చుక్కెదురైంది. ఈ జిల్లాలోని దర్శి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించింది. దర్శి మున్సిపాలిటీలోని 20 వార్డులకు గాను 13 వార్డుల్లో తెలుగుదేశం విజయం సాదించగా.. వైసీపీ 7 వార్డులకే పరిమితం అయింది. వైసీపీ నాయకుల మధ్య సమన్వయలోపంతోపాటు అనేక స్థానిక కారణాలే తమ కొంపముంచాయని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.  
ఫలితాలపై స్పందించిన సీఎం జగన్
స్థానిక ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. 'దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు' అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.