ఆపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) గా భారత సంతతి వ్యక్తి

ఆపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) గా భారత సంతతి వ్యక్తి

ఆపిల్ తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (COO) సబీహ్ ఖాన్‌ను నియమించింది. జెఫ్ విలియమ్స్ తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు ఖాన్. సబీహ్ ఖాన్ భారత సంతతికి చెందిన వ్యక్తి. అతను 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. 1995లో ఆపిల్ ప్రొక్యూర్మెంట్ గ్రూప్‌లో చేరారు. అప్పటి నుంచి ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్, తయారీ, సేకరణ, లాజిస్టిక్స్, ఉత్పత్తి సరఫరా వంటి కీలక విభాగాలలో పనిచేశారు. గత ఆరేళ్లుగా ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

ఐదవ తరగతిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. టఫ్ట్స్ యూనివర్సిటీనుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలు పొందారు. ఆ తర్వాత రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేశారు.

ఆపిల్‌లో సబీహ్ ఖాన్ ప్రస్థానం

సబీహ్ ఖాన్ 1995లో ఆపిల్ ప్రొక్యూర్మెంట్ గ్రూప్‌లో చేరారు. అప్పటి నుంచి ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్, తయారీ, సేకరణ, లాజిస్టిక్స్, ఉత్పత్తి సరఫరా వంటి కీలక విభాగాలలో పనిచేశారు. గత ఆరేళ్లుగా ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్‌కు నేతృత్వం వహిస్తున్నారు.  2019నుంచి ఆపిల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 
సబీహ్ ఖాన్‌ను "గొప్ప వ్యూహకర్త" అని, ఆపిల్ సప్లై చైన్‌కు కీలక రూపశిల్పి అని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రశంసించారు.  అధునాతన తయారీలో కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో, యునైటెడ్ స్టేట్స్‌లో ఆపిల్ తయారీ విస్తరణను పర్యవేక్షించడంలో, పర్యావరణ స్థిరత్వ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.

ALSO READ : ఇస్రో మరో ముందడుగు..గగన్‌యాన్ మిషన్‌కు బూస్ట్..రెండు కీలక పరీక్షలు విజయవంతం

బాధ్యతల స్వీకరణ.. 

జూలై 2025 చివరి వారంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సబీహ్ ఖాన్ బాధ్యతలు స్వీకరిస్తారు. జెఫ్ విలియమ్స్ ఈ ఏడాది చివరి వరకు ఆపిల్‌లో కొనసాగుతారు. డిజైన్ బృందం, ఆపిల్ వాచ్‌లకు పర్యవేక్షణ అందిస్తారు. ఆ తర్వాత డిజైన్ బృందం నేరుగా టిమ్ కుక్‌కు రిపోర్టు చేస్తుంది. 

భారతదేశం ఆపిల్‌కు ప్రధాన మార్కెట్‌గా, తయారీ కేంద్రంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో సబీహ్ ఖాన్ నియామకం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. గ్లోబల్ సప్లై చైన్, తయారీలో విస్తృతమైన అనుభవం ఉండటం ఆపిల్‌కు మరింత ప్రయోజనం చేకూరుస్తుందంటున్నారు టెక్ నిపుణులు. ఈ నియామకం ఆపిల్ ఉన్నతపోస్టులలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. భవిష్యత్తులో కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాలపై ఇది ప్రభావం చూపుతుందంటున్నారు టెక్ నిపుణులు.