
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్ లో కీలక ముందుడుగు పడింది. గగన్ యాన్ సర్వీస్ మోడ్యూల్ ప్రపోల్షన్ సిస్టమ్(SMPS) కు సంబంధించి రెండు హాట్ టెస్టులను విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. ఈ పరీక్షలు జూలై 3న తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో నిర్వహించారు.
ఈ టెస్టుల ద్వారా SMPS ప్రస్తుత కాన్ఫిగరేషన్ ను నిర్దారించేందుకు చేశారు. మొదటి పరీక్ష 30 సెకన్లు, రెండవ పరీక్ష 100 సెకన్లు కొనసాగింది. ఈ పరీక్షల్లో ప్రొపల్షన్ సిస్టమ్ ముందుగా అంచనా వేసిన విధంగానే సాధారణంగా పనిచేసిందని ఇస్రో ధృవీకరించింది.
ALSO READ | ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.50 వేలకి పైగా జీతం..
100 సెకన్ల పాటు జరిగిన పరీక్షలో ఐదు లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఇంజిన్లు (ప్రతి ఒక్కటి 440N థ్రస్ట్) ,16 రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (RCS) థ్రస్టర్‌లు (ప్రతి ఒక్కటి 100N థ్రస్ట్) ఒకేసారి స్థిరమైన ,పల్స్డ్ మోడ్‌లలో విజయవంతంగా పనిచేయడం ఈ పరీక్షలో కనిపించిందని ఇస్రో ప్రకటించింది.
SMPS ప్రాముఖ్యత
SMPS అనేది గగన్‌యాన్ ఆర్బిటల్ మాడ్యూల్‌లో ఒక కీలక భాగం. ఇది కక్ష్య విన్యాసాలకు ,ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మిషన్ రద్దు కోసం ఇది కీలకం అని ఇస్రో తెలిపింది. ఫ్లైట్ పరిస్థితులకు దగ్గరగా ప్రొపల్షన్ సిస్టమ్ పరిస్థితులను అనుకరించడానికి, మునుపటి హాట్ టెస్ట్‌ల నుంచి పొందిన అనుభవం ఆధారంగా SMPS టెస్ట్ ఆర్టికల్‌లో మెరుగుదలలు ఈ పరీక్షలో చూశారు. ఈ సక్సెస్ తో త్వరలో పూర్తి నిడివి హాట్ టెస్ట్‌ను నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇది గగన్‌యాన్ మానవ అంతరిక్ష యాత్రకు ఒక కీలకమైన అడుగు.
గగన్‌యాన్ ప్రాజెక్టును 2027 మొదటి త్రైమాసికంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ SMPS టెస్టులు భారతదేశం మానవ సహిత అంతరిక్ష యాత్ర సామర్థ్యాన్ని ప్రదర్శించే గగన్‌యాన్ మిషన్ విజయానికి చాలా ముఖ్యమైనవి.