కశ్మీర్ లో యాపిల్ వ్యాపారిని కాల్చి చంపిన టెర్రరిస్టులు

కశ్మీర్ లో యాపిల్ వ్యాపారిని కాల్చి చంపిన టెర్రరిస్టులు
  • మూడు రోజుల్లో ముగ్గురి హత్య.. జనాల్ని భయపెట్టే కుట్ర
  • ఉదయమే ఇటుకల బట్టీ కూలీని చంపిన టెర్రరిస్టులు
  • సోమవారం లారీ డ్రైవర్ని పొట్టనబెట్టుకున్న ముష్కరులు

శ్రీనగర్: కశ్మీర్లో ప్రశాంతత లేకుండా చేయాలని ముష్కరులు దాడులకు దిగుతున్నారు. వ్యాపారాలు జరగకుండా చేసేందుకు ప్రజల్లో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జమ్ము కశ్మీర్ లో పనులు చేసుకుంటున్నవారిని టార్గెట్ చేసి.. చంపేస్తున్నారు. ఇలా మూడు రోజుల్లో ముగ్గుర్ని దారుణంగా హత్య చేశారు.

ఇవాళ సాయంత్రం సోపియన్ ప్రాంతంలో ఓ యాపిల్ వ్యాపారిని దారుణంగా కాల్చి చంపారు టెర్రరిస్టులు. పంజాబ్ నుంచి వచ్చిన చరణ్ జీత్ సింగ్ ఇక్కడి ట్రెంజ్ గ్రామంలో వ్యాపారం చేస్తుండగా దాడి జరిగింది. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న మరో వ్యాపారి సంజీవ్ కి కూడా బుల్లెట్ తగిలింది. పుల్వామా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు డాక్టర్లు. అక్కడి నుంచి శ్రీనగర్ లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రస్తుతం శ్రీనగర్ హాస్పిటల్ లో చావుతో పోరాడుతున్నాడు సంజీవ్. 7.30 గంటల సమయంలో నలుగురు ఉగ్రవాదులు తుపాకులతో వచ్చి కాల్చి.. పారిపోయారని స్థానికులు చెబుతున్నారు.

ఉదయమే ఓ కూలీ హత్య

పుల్వామాలో ఓ రోజువారీ కూలీని ఈ రోజు ఉదయం టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఛత్తీస్ గడ్ లోని బెసోలీకి చెందిన సేతీ కుమార్ సాగర్ ఇక్కడ ఓ ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. ఉదయం బట్టీకి నడిచి వెళ్తుండగా.. అతడిని కాల్చి చంపారు ఉగ్రవాదులు.

సోమవారం రాజస్థాన్ కు చెందిన ఓ లారీ డ్రైవర్ ని హత్య చేశారు టెర్రరిస్టులు. ఓ యాపిల్ తోట నుంచి లోడ్ తో వెళ్తుండగా అతడిని కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతా ప్రశాంతంగా ఉందని కేంద్రం చెబుతుంటే.. దాన్ని భంగం కలిగించేందుకు టెర్రరిస్టులు కుట్రలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జమ్ము కశ్మీర్ వచ్చే వాళ్లనే టార్గెట్ చేసి చంపేస్తున్నారు. శాంతి భద్రతలు లేకుండా చేసి, లోయను అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు. దీనికి గట్టిగా జవాబు చెబుతామని పోలీసులు చెబుతున్నారు. కశ్మీర్ లో ఎక్కడా టెర్రరిస్టులే లేకుండా ఏరిపారేస్తామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా ముగ్గురు లష్కరే తోయిబా టెర్రరిస్టుల్ని ఎన్ కౌంటర్లో హతం చేసినట్లు చెప్పారు డీజీపీ దిల్బాగ్ సింగ్.