హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు గతం కంటే దరఖాస్తులు తగ్గాయి. గడువు పొడగించినప్పటికీ ఆశించిన మేర అప్లికేషన్లు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు 95,285 అప్లికేషన్లు వచ్చాయి. అక్టోబర్ 27వ తేదీన లక్కీ డ్రాలో వైన్స్‌లను కేటాయిస్తారు. వాస్తవానికి అక్టోబర్ 18వ తేదీ వరకే అప్లికేషన్లు వేసేందుకు గడువు ఉండగా.. గతం కంటే అప్లికేషన్లు తగ్గడం, గడువు తేదీ ముందు రోజు బీసీ బంద్, బ్యాంకు సెలవుల నేపథ్యంలో ఈ నెల23 వరకు వరకు పెంచారు. అయినప్పటికీ అప్లికేషన్ల సంఖ్య పెద్దగా పెరగలేదు. కొత్తగా 6 వేల అప్లికేషన్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి.
దరఖాస్తులతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్‌లు ఉన్నాయి. ఒక్క అప్లికేషన్‌కు రూ.3 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్ రిఫండబుల్. 2023లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 1.31 లక్షలు కాగా ఈ సారి దాదాపు 36 వేల అప్లికేషన్లు తగ్గాయి. ఫీజు రూ.3 లక్షలు చేయడంతో ఈ సారి అప్లికేషన్లు తగ్గినా ఆదాయం పోయినసారి అంతే వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దీనికి తోడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా వస్తుంది. ఈ మొత్తం కూడా కలిపితే ఆదాయం ఇంకింత పెరగనుంది. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 36 అప్లికేషన్లు వచ్చాయి.
ఏపీ పాలసీ ఎఫెక్ట్‌తో పాటు ఫీజు పెంపు, సిండికేట్ వ్యవహారాలు దరఖాస్తుల తగ్గుదలపై ప్రభావం చూపింది. ఎలాగైనా వైన్స్ ను దక్కించుకోవాలని భావించిన కొందరు వారి ప్రాంతాల్లో 10 మంది కలిసి రెండు, మూడు మద్యం దుకాణాలకు అప్లికేషన్లు సమర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి దగ్గరి బంధువుల చేత ఎక్కువ అప్లికేషన్లు వేయించారు. రియల్టర్లు.. ఇప్పటికే వైన్స్‌లు నిర్వహిస్తున్న వారు కూడా రకరకాలుగా అప్లికేషన్లు వేశారు.
