వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలి

వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలి

ప్రభుత్వానికి 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏ వారసుల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని 61 ఏళ్ల పైబడిన వీఆర్ఏ వారసులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే సమస్యపై మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో  సెక్రటేరియెట్ ముందు ఆందోళన నిర్వహించారు. గత ప్రభుత్వం  3,797 మంది 61 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగ నియామకం కోసం  జీవో నెంబర్ 81, 85 జారీ చేసిందని తెలిపారు. కానీ ఈ జీవోలపైన స్టే ఉన్న కారణంగా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.

హైకోర్టు డివిజన్ బెంచ్ జీవో నెంబర్ 81పైన ఉన్న స్టేను ఎత్తివేసిందన్నారు.  ఇప్పటి వరకు 14 మంది వీఆర్ఏలు కూడా మరణించారని..మొత్తం 20,555 మందిలో 16758 మంది వివిధ శాఖలలో వారి వారి అర్హతలను బట్టి నియామక ఉత్తర్వులు, ఐడీలు కూడా పొందారని వివరించారు. మిగిలిన 3797 మందికి ఇప్పటి వరకు ఎలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందే వీఆర్ఏల వారసులకు నియామకాలు చేపట్టాలని కోరారు. వీరితో పాటు 55 ఏండ్లు పైబడిన వాళ్లు కూడా వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఎలాంటి పెన్షన్, ఇతర బెనిఫిట్స్​ లేవని.. కనీసం ఇలాగైనా తమకుటుంబాలను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు.