పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన రెహమాన్ కొడుకు

పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన రెహమాన్ కొడుకు

ఏఆర్ రెహమాన్.. సంగీత ప్రపంచంలో తెలియని వారు ఎవరూ ఉండరు.. ఆయన కుమారుడు కూడా తండ్రి బాటలోనే సంగీత ప్రపంచంలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఏఆర్ అమీన్. సంగీత దర్శకుడిగానే కాకుండా పాటలు పాడుతూ కెరీర్ నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న అమీన్.. భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ యాక్సిడెంట్ వివరాలను అమీన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించటంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఓ తమిళ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సమయంలో భారీ క్రేన్ కు కట్టిన లైట్లు.. 50 అడుగుల ఎత్తు వరకు వేలాడదీసి ఉన్నాయి. ఆ క్రేన్ కు సమీపంలోనే అమీన్ తన పనిలో బిజీగా ఉన్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే.. 50 అడుగుల ఎత్తులో ఉన్న లైట్లు.. క్రేన్ నుంచి ఒక్కసారిగా కింద పడ్డాయి. కింద పడిన లైట్ల గాజు ముక్కలు కొన్ని తన వైపు దూసుకొచ్చాయని.. అదృష్టవశాత్తు తనకు ఏమీ కాలేదని.. ప్రాణాలతో బయటపడ్డానంటూ రాసుకొచ్చాడు అమీన్. పాట చిత్రీకరణలో భాగంగానే షూటింగ్ స్పాట్ కు వెళ్లానని.. ఆ పనిలో బిజీగా ఉన్నప్పుడే ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు అమీన్. మూడు రోజులు అయినా.. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదని.. త్వరలోనే బయటకు వస్తానంటూ వివరించారు అమీన్.

ఈ ఘటనపై తండ్రి ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. అదృష్టవశాత్తు నా కుమారుడికి ఏమీ కాలేదని.. షూటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉండాలని.. చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు రెహమాన్. భగవంతుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతున్న సమయంలో.. భద్రతా ప్రమాణాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు రెహమాన్. ఈ ప్రమాదంపై సినిమా యూనిట్ నుంచి పూర్తి వివరాల కోసం వెయిట్ చేస్తున్నానని.. తప్పెక్కడ జరిగింది అనేది తెలియాల్సి ఉందన్నారు రెహమాన్. 

ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ గాయపడినట్లు వార్తలు వచ్చిన క్రమంలోనే.. రెహమాన్ కుమారుడు అమీన్ వ్యవహారం కూడా వెలుగులోకి రావటం విశేషం.. షూటింగ్స్ లో వరస ప్రమాదాలపై సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.. తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రమాణాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉందని నటీనటులు డిమాండ్ చేస్తున్నారు.