‘మమ్మీ’ మనకే..

‘మమ్మీ’ మనకే..

‘మమ్మీ’ మనకే.. బుద్ధుడి చితాభస్మం ఏపీకి..
మొదలైన ‘ఆర్కియాలజీ’ పంపకాలు

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ కు సంబంధించిన పంపకాల ప్రక్రియ మొదలైంది. విగ్రహాలు, నాణేలు, అపురూపమైన వస్తువులు, ఆస్తుల పంపిణీకి అధికారులు లిస్ట్​ రెడీ చేస్తున్నారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ మధ్యలోని స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టిన ఈజిప్టు మమ్మీని 1930లో ఏడో నిజాం కొనుగోలు చేశారు. ఇది మన రాష్ట్రానికే చెందుతుందని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో లభ్యమైన శిల్పాలు, శాసనాలు, స్తంభాలు, నాణెలు ఇక్కడి మ్యూజియాల్లోనే ఉండనున్నాయి. ఉమ్మడి ఏపీలో కొనుగోలు చేసిన ఎగ్జిబిట్లను వాటి విలువ ఆధారంగా ఫిఫ్టీ.. ఫిఫ్టీగా పంచనున్నారు.

అమరావతిలో 2006లో జరిగిన కాలచక్ర ఉత్సవాల్లో ప్రదర్శించేందుకు తెలంగాణలో లభ్యమైన బుద్ధుడి విగ్రహాలను తరలించారు. అలాగే ఇతర బుద్ధుడి విగ్రహాలు కొన్ని విశాఖపట్నం, విజయవాడ మ్యూజియాల్లో ఉన్నాయి. వాటిని కూడా తెలంగాణకు తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లోని విశాఖపట్నం శివారులోగల బావికొండగుట్టపై 1980లో జరిపిన తవ్వకాల్లో మహాచైత్యం, బౌద్ధ విహారం వెలుగు చూశాయి. అక్కడ దక్షిణ దిక్కున ఉన్న చిన్నపాటి రాతి స్తూపం కింద మట్టిపాత్రలో లభించిన బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక లభించాయి. దానిని బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు గుర్తించారు. దీనిని అత్యంత విలువైనదిగా గుర్తించి హైదరాబాద్‌ మ్యూజియంలో భద్రపరిచారు. దీన్ని విభజనలో భాగంగా ఏపీకి తరలించనున్నారు.