
షాంఘై: వరల్డ్ కప్ స్టేజ్–2లో ఇండియా ఆర్చర్ల గురి అదిరింది. కాంపౌండ్ విభాగంలో మెన్స్, విమెన్స్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లడంతో రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ సెమీస్‌లో తెలంగాణ అమ్మాయి చికిత, ఏపీ ఆర్చర్ జ్యోతి సురేఖ, మధురతో కూడిన ఇండియా త్రయం 232–230తో గ్రేట్ బ్రిటన్‌పై నెగ్గింది. క్వార్టర్స్‌లో 232–229తో కజకిస్తాన్‌ను ఓడించిన ఇండియా తొలి రౌండ్‌లో బై లభించింది.
మెన్స్ సెమీస్‌లో ఓజాస్ డియోటలే–అభిషేక్ శర్మ–రిషబ్ యాదవ్‌తో కూడిన టీమిండియా 232–231 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో రెండు జట్లు.. మెక్సికోతో తలపడతాయి. మెన్స్ రికర్వ్ క్వాలిఫికేషన్‌లో బొమ్మదేవర ధీరజ్ 677 పాయింట్లతో తొమ్మిదో ప్లేస్‌లో నిలిచాడు. తరుణ్‌దీప్ రాయ్ (666), అటాను దాస్ (652) వరుసగా 28, 57వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. మెన్స్ టీమ్ 1995 పాయింట్లతో ఏడో ప్లేస్‌లో నిలిచింది. విమెన్స్ రికర్వ్‌లో దీపికా కుమారి (655), అంకితా భాటియా (652), అన్షికా కుమారి (642) వరుసగా 12, 17, 29వ ప్లేస్‌లో నిలిచారు. టీమ్ విభాగంలో 1949 పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించారు.