
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షట్లర్ అన్మోల్ ఖర్బ్.. అర్కిటిక్ ఓపెన్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో అన్మోల్ 21–15, 21–14తో అమాలీ షుల్జ్ (డెన్మార్క్)పై గెలిచింది. 36 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్న అన్మోల్.. రెండో గేమ్‌లో ఈజీగా చెక్ పెట్టింది. ఆరంభంలో ఇద్దరు బలమైన స్ట్రోక్ ప్లే ఆడటంతో స్కోరు 13–13 వరకు సమంగా సాగింది.
ఈ దశలో వ్యూహాత్మకంగా ఆడిన అన్మోల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో నిలిచింది. ఆ తర్వాత ప్రత్యర్థికి రెండు పాయింట్లు సమర్పించుకున్నా ఈజీగా గేమ్ నెగ్గింది. 4–2తో రెండో గేమ్‌ను మొదలుపెట్టిన అన్మోల్.. అమాలీకి స్కోరు సమం చేసే చాన్స్ ఇవ్వలేదు. స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగింది. 16–14 వద్ద వరుసగా ఐదు మ్యాచ్ పాయింట్లు కాచుకుని చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తానీషా క్రాస్టో 7–21, 10–21తో జియాంగ్ జెన్ బాంగ్–వీ యా జిన్ (చైనా) చేతిలో ఓడారు.