ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు సాధ్యమేనా?

ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు సాధ్యమేనా?

‘1945లో అప్పటి పరిస్థితులకనుగుణంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. ఇప్పుడు ప్రపంచ దేశాల అవసరాలు, ప్రాధామ్యాలు మారాయి. యూఎన్​వోలోనూ సంస్క రణలు తీసుకురావాలి.  భద్రతా మండలిని పునర్​ వ్యవస్థీకరించాలి’ అని యూఎన్​వో 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నేపథ్యంలో యూఎన్​వో పునర్​వ్యవస్థీకరణ సాధ్యాసాధ్యాలు.. భారత్​కు శాశ్వత సభ్యత్వం.. అంశాలపై ఈ వారం కరెంట్​ టాపిక్​.

ప్రపంచశాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన అట్లాంటిక్​ చార్టర్​(1941) ద్వారా వ్యక్తమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ప్రాంక్లిన్​ రూజ్​వెల్ట్​​, నాటి బ్రిటీష్​​ ప్రధాన మంత్రి విన్​స్టన్​ చర్చిల్​ సంతకాలు చేసిన ఈ అట్లాంటిక్​ చార్టర్​ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు కీలకాంశంగా మారింది. అట్లాంటిక్​ చార్టర్​లో పేర్కొన్న అంశాలను అంతర్భాగం చేసి1942 జనవరి 1న 26 దేశాలు ఐక్యరాజ్య సమితి ప్రకటన విడుదల చేశాయి. తర్వాత అమెరికా, బ్రిటన్​, సోవియట్​ యూనియన్​(రష్యా) చైనా దేశాల విదేశాంగ మంత్రులు 1943 అక్టోబర్​ 30న మాస్కో ప్రకటనను ఆమోదించాయి. ఈ నాలుగు దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి నిర్మాణంపై ఒక ముసాయిదాను తయారు చేయడానికి 1944 అక్టోబర్​లో అమెరికాలోని వాషింగ్టన్​ నగరపు డంబర్టన్​ ఓక్స్​లో సమావేశమయ్యారు. మళ్లీ 1945లో వాల్టాలో సమావేశమై ప్రాంక్లిన్​ రూజ్​వెల్ట్​​, జోసఫ్​ స్టాలిన్​, విన్​స్టన్​ చర్చిల్​ ఒక నూతన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచడానికి విశ్వశాంతిని కోరుకునే అన్ని రాజ్యాలతో ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సందర్భంగా 44 రాజ్యాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక న్యాయ కోవిదుల కమిటీ కూడా వాషింగ్టన్​లో సమావేశమై అంతర్జాతీయ న్యాయస్థానం ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి సమాయత్తమైంది. చివరగా 50 దేశాలకు చెందిన ప్రతినిధులు 1945 ఏప్రిల్​ 25, 26 తేదీల్లో శాన్​ ప్రాన్సిస్కోలో సమావేశమై డంబర్టన్​ ఓక్స్​ ప్రతిపాదనలు, అంతర్జాతీయ న్యాయస్థానం రాజ్యాంగ ముసాయిదాను చర్చించాయి. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి చార్టర్​ను ఆమోదిస్తూ సంతకాలు చేశాయి. ఈ చార్టర్​ 1945 అక్టోబర్​ 24 నుంచి అమలులోకి వచ్చింది. 50 దేశాల సభ్యులతో 1945 అక్టోబర్​ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది.

యూఎన్వో చార్టర్

ఐక్యరాజ్యసమితి రాజ్యాంగాన్ని చార్టర్​ అంటారు. దీనిలో 3 ప్రకరణలు 19 అధ్యాయాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని వివిధ అంగాలు, ఆశయాలు, ప్రధాన సూత్రాలను ప్రవేశికగా పేర్కొంటారు. యూఎన్​వో తన కార్యక్రమాలను ఈ చార్టర్​కు లోబడి చేపడుతుంది.

ముఖ్య శాఖలు

  1. సాధారణ సభ, 2. భద్రతా మండలి 3.ఆర్థిక–సాంఘిక మండలి, 4. ధర్మ కర్తృత్వ మండలి, 5. అంతర్జాతీయ న్యాయ స్థానం 6. సచివాలయం(వీటిలో ప్రస్తుతం ధర్మ  కర్తృత్వ మండలి పనిచేయడం లేదు)

వీటో అధికారం భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది. మండలిలో చర్చకు వచ్చే విధానపరమైన అంశాలలో రెండు వంతుల మెజార్టీ సభ్యుల ఆమోదంతోపాటు శాశ్వత సభ్య దేశాల ఆమోదం కూడా తప్పనిసరి. ఈ శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం తీర్మానాన్ని తిరస్కరించినా.. ఆ అంశం చెల్లదు. వీటో అధికారం అంటే తిరస్కరించే అధికారం అని అర్థం. ఇటీవల భద్రతామండలి తాత్కాలిక సభ్య దేశాల ఖాళీలను భర్తీ చేయడానికి ఎన్నిక నిర్వహించారు. భారత్​తోపాటు ఐర్లాండ్, నార్వే, మెక్సికో, కెన్యా దేశాలను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో యూఎన్​వోలో సభ్యత్వం ఉన్న 193 దేశాలలో 184 దేశాలు భారత్​కు అనుకూలంగా ఓటు వేశాయి. భద్రతా మండలిలో భారత్​ 8వ సారి  తాత్కాలిక సభ్యత్వం పొందింది.

భద్రతామండలి పునర్​ వ్యవస్థీకరణ..

ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలలో అత్యంత శక్తిమంతమైన, ప్రధానమైన విభాగం భద్రతామండలి. దీన్నే యూఎన్​వో కార్యనిర్వాహక విభాగంగా పేర్కొనవచ్చు. ఇందులో15 దేశాలు సభ్యులుగా ఉంటాయి. 5 రాజ్యాల(దేశాల)కు శాశ్వత సభ్యత్వం ఉంటుంది. మిగిలిన పది తాత్కాలిక దేశాలను సాధారణ సభ ప్రతి రెండేళ్ల పదవీ కాలానికి ఎన్నుకుంటుంది. ఈ పది తాత్కాలిక దేశాలలో అయిదు ఆఫ్రికా–ఆసియా ఖండాల నుంచి ఒకటి తూర్పు యూరోప్​ నుంచి, రెండు లాటిన్​ అమెరికా ఖండం నుంచి, రెండు పశ్చిమ యూరోప్​ తదితర ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నికవుతాయి.  భద్రతామండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్య రాజ్యాల మధ్య అక్షర క్రమంలో మారుతూ ఉంటుంది. భద్రతా మండలికి సాయం అందించడానికి మూడు స్థాయీ సంఘాలు ఉంటాయి. ఇందులో శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్,  ప్రాన్స్​. శాశ్వత సభ్య దేశాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని భారత ప్రధాని సహా పలు దేశాలు డిమాండ్​ను తెరమీదకు తెస్తున్నాయి. భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలంటే మొదటగా సాధారణ సభలో తీర్మానం చేసి, ఐక్యరాజ్య సమితి చార్టర్​ను మార్చి కొత్త దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించే నిబంధనను చేర్చాల్సి ఉంటుంది. లేదా యూఎన్​వో భద్రతా మండలిలో ఉన్న శాశ్వత సభ్యదేశాలకు కల్పించే వీటో అధికారాన్ని రద్దు చేయాలి. ఈ రెండింటిలో దేన్ని మార్చినా సంస్కరణలు మొదలైనట్లే.

భారత్​కు శాశ్వత సభ్యత్వం  సాధ్యమేనా?

ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ సమయంలో సభ్యదేశాలు 50 ఉండగా ప్రస్తుతం 193 ఉన్నాయి. ఐదు శాశ్వత సభ్య దేశాలు, పది తాత్కాలిక సభ్య దేశాలున్నాయి. నిధులు అందించడంలో, విధులు నిర్వర్తించడంలో భారత్​ విశిష్ట పాత్ర వహిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా. జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశంగా భారత్​కు గుర్తింపు ఉంది. ఇటీవల ప్రధాని ప్రసంగంలో భారత్​కు యూఎన్​వోలో శాశ్వత సభ్యత్వం ఎప్పుడు? అనే అంశంపై మాట్లాడారు. ఇది వరకే యూఎన్​వోలో భారత్​కు శాశ్వత సభ్యత్వంపై ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ముందడుగు పడలేదు. శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​, రష్యాలు భారత్​ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు ఒప్పుకుంటే సభ్యత్వం వచ్చేది. కానీ చైనాతోపాటు మరికొన్ని దేశాలు ప్రతీసారి అడ్డుపడుతున్నాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా భద్రతా మండలి పునర్​వ్యవస్థీకరణ, మండలి సభ్య(శాశ్వత, తాత్కాలిక) దేశాల సంఖ్య పెంపు, వీటో అధికారం విస్తరణ తదితర డిమాండ్లు వర్తమాన దేశాల నుంచి వినిపిస్తున్నాయి.