
కోరుట్ల, వెలుగు: తన భార్య కాపురానికి రావడం లేదని మహిళా సంఘాలు, కుటుంబసభ్యులతో కలిసి ఓ వ్యక్తి అత్తింటి వద్ద ఎదుట ఆందోళనకు దిగాడు. కోరుట్ల పట్టణం ప్రకాశం రోడ్డు కాలనీకి చెందిన శివానీతో అదే ప్రాంతానికి చెందిన గాజుల అజయ్‌కు నాలుగేండ్ల కింద పెండ్లయింది. అజయ్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అత్తమామలతో కలిసి ఉండేది. వారితో గొడవల కారణంగా శివానీ కొద్ది నెలల కింద పుట్టింటికి వెళ్లింది. అజయ్ గల్ఫ్ నుంచి భార్యకు పలుమార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాకపోవడంతో 10 నెలల కింద ఇంటికి వచ్చాడు. ఇంటికి రావాలని నచ్చజెప్పినా వినకపోవడంతో ఆదివారం ఆమె పుట్టింటి ఎదుట కుటుంబసభ్యులు, మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేశారు.
అజయ్ గల్ఫ్‌కు వెళ్లేముందు శివానీ ప్రెగ్నెంట్ కాగా.. తన కొడుకును ఇప్పటివరకు చూడలేదని అవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, కొడుకు తనకు కావాలని భార్యను కాపురానికి పంపించాలని వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరుకుటుంబాలను సముదాయించారు. కాగా భార్య శివాని మాట్లాడుతూ తనకు అత్తింటివారితో ప్రాణహాని ఉందని, అందుకే పుట్టింటికి వచ్చానని చెప్పింది. తన ఒంటిపై ఉన్న బంగారు నగలు లాక్కున్నారని, మానసికంగా హింసిస్తున్నారని, చంపాలని చూస్తున్నారని ఆరోపించింది. గతంలోనూ అత్తామామల వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లినట్లు చెప్పింది.