ఉద్యోగాల భర్తీపై చాలెంజ్​కు సిద్ధమా?.. రాహుల్​ గాంధీ, బీజేపీ నేతలకు కేటీఆర్​ సవాల్

ఉద్యోగాల భర్తీపై చాలెంజ్​కు సిద్ధమా?.. రాహుల్​ గాంధీ, బీజేపీ నేతలకు కేటీఆర్​ సవాల్
  • కాళేశ్వరం కామధేనువు.. రాజకీయాల కోసం విమర్శించొద్దు
  • కాంగ్రెస్​ పవర్​లో ఉంటే.. ప్రజల పవర్​ పోతది
  • ఒక్కొక్కరి తలపై మోదీ రూ.5 లక్షల అప్పు మోపిండు
  • ‘ట్రయల్​ బ్లేజర్​ తెలంగాణ ప్రజంటేషన్’​లో మంత్రి కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చాలెంజ్​కు సిద్ధమా అని మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్​ముఖ్య నేత రాహుల్​గాంధీ, బీజేపీ నేతలకు సవాల్​విసిరారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్​పాలనలో సాధించిన ప్రగతిపై గురువారం హైదరాబాద్​లోని ఒక హోటల్​లో ‘ట్రయల్​బ్లేజర్​తెలంగాణ’ ప్రజంటేషన్​ఇచ్చారు. తమ ప్రభుత్వం1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇంకో 42 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. తమ కన్నా మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉంటే చెప్పాలన్నారు. ‘‘ఊరికే గావు కేకలు.. పెడబొబ్బలు పెట్టుడు కాదు.. నేను ఇచ్చినట్టుగా ప్రజంటేషన్​ఇవ్వండి.. ఫలానా చోట ఇంతకన్నా ఎక్కువ చేశామని చెప్పండి. గుజరాత్​లో 6 కోట్ల జనాభా ఉంది, రాజస్థాన్​జనాభా 8.50 కోట్లు.. ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు. మన దగ్గర 4 కోట్ల జనాభాకు1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరి రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇవ్వనోళ్లు ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నరు. ఇవి వాస్తవాలు. ఉద్యోగాల భర్తీ వివరాలను వెబ్​సైట్ లో పబ్లిష్​చేశాం. నిజాలు ఇవి కాదని రుజువు చేసే దమ్ముందా? ప్రైవేట్​సెక్టార్​లో లక్షల ఉద్యోగాలు సృష్టించి ఉపాధి కల్పించాం” అని కేటీఆర్​తెలిపారు.

కరువు పోయింది..

ఉమ్మడి రాష్ట్రంలో నెర్రెలు బారిన, నెత్తురు కారిన నేలలు ఈరోజు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయని కేటీఆర్​అన్నారు. ‘‘కాళేశ్వరం కామధేనువు, కల్ప తరువు.. దీని గురించి తప్పుగా మాట్లాడకండి.. డిసెంబర్ తర్వాత కూడా రాజకీయాలు చేసుకోవచ్చు.. రాజకీయాల కోసం కాళేశ్వరంపై విమర్శలు చేయొద్దు’’ అని అన్నారు. ‘‘బ్యారేజీల్లో సమస్యలు వస్తాయని.. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం, ఫరక్క బ్యారేజీలోనూ సమస్యలు వచ్చాయి.. నాగార్జున సాగర్ లోనూ లీకేజీలు ఉండేవి.. శ్రీశైలం పంపుహౌస్​రెండేళ్ల కింద మునిగిపోయింది”అని కేటీఆర్​గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్ కు పవర్ ఉంటే ప్రజలకు పవర్ ఉండదు. కర్నాటక లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అక్కడి ప్రజలకు కరెంటు లేకుండా పోయింది” అని విమర్శించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని ఎన్ సీఆర్బీ రికార్డులు చెప్తున్నాయన్నారు. ‘‘పలకతో రండి పట్టాతో పొండి అనే నినాదంతో గాంభీరావుపేట లో కేజీ టు పీజీ విద్యాలయం ఏర్పాటు చేశాం.. భవిష్యత్ లో రాష్ట్రమంతా విస్తరిస్తం. ధరణిలో లోపాలు ఉండొచ్చు కానీ, భూమాతతో పట్వారీ వ్యవస్థ తెస్తామని కాంగ్రెస్​మేనిఫెస్టోలో పెట్టారు. ప్రధాని మోదీ ఒక్కొక్కరి తలపై రూ.5 లక్షల అప్పు మోపారు. మేం అప్పులు చేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది”అని కేటీఆర్​తెలిపారు.

కాంగ్రెస్​ వస్తే రియల్​ ఎస్టేట్  పడిపోతది

రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్​అధికారంలోకి వస్తే రియల్​ఎస్టేట్​పడిపోతుందని మంత్రి కేటీఆర్​అన్నారు. గురువారం ఓ టీవీ చానల్​నిర్వహించిన కాన్​క్లేవ్​లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆరు నెలలకోసారి సీఎం మారడం ఖాయమని, అలాంటి పరిస్థితుల్లో స్థిరమైన పాలన ఇవ్వలేరన్నారు. కర్నాటకలో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగళూరులో రియల్​ఎస్టేట్ రంగం 28 శాతం పడిపోయినట్టుగా నివేదికలు చెప్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఇక్కడ​అధికారంలోకి వస్తే రియల్​ఎస్టేట్​రంగం ఢమాల్​అంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అన్నారు. బెంగళూరులో రియల్​ఎస్టేట్​రంగం పడిపోతుంటే…హైదరాబాద్​ లో రియల్​ఎస్టేట్​రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్​పార్టీనే ప్రత్యర్థి అని చెప్పారు. కాంగ్రెస్​తో పోటీ ఉన్నా చివరకు గెలిచేది తామేనని.. 72 నుంచి 80 స్థానాల్లో గెలుస్తామని తెలిపారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్​ను, కేసీఆర్​నాయకత్వాన్నే కోరుకుంటోందన్నారు.