విశ్వాసం : జ్ఞాన సంపన్నులను గౌరవించాలి

విశ్వాసం : జ్ఞాన సంపన్నులను గౌరవించాలి

ఈ చరాచర జగత్తులో, అనేక కోట్ల జీవరాశులు నిరంతరం పుడుతూ గిడుతూ ఉంటాయి. ఇన్ని ప్రాణులలోనూ... విజ్ఞతతో ప్రవర్తించడం, జ్ఞానం సముపార్జించటం, విచక్షణా జ్ఞానం కలిగి, ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనే అంశాలు కేవలం మానవులకు మాత్రమే లభించిన వరం. అంతటి గొప్ప వరాన్ని పొందిన మానవులు ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు అనాదిగా చెబుతూనే ఉన్నారు. ఇందుకోసమై మన నడవడికకు సంబంధించిన విశేషాలను అనేక ఉదాహరణలతో మనకు బోధపరిచారు.

తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి అని మొట్టమొదటి సూత్రంగా చెప్పారు. అలా వినాయకుడు తల్లిదండ్రులను గౌరవించి ముక్కోటి పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలం పొంది, విఘ్నాధి పత్యం పొందాడు.  ఆ తరువాత... వయసులో చిన్నవారైనప్పటికీ, జ్ఞానసంపన్నులను తప్పక గౌరవించాలన్నారు. అందుకే - ఎంతటివారైనా ఎక్కడ, ఎవరితో, ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కొందరు మితిమీరిన అహంకారంతో విర్రవీగుతూ, పెద్దలను అగౌరవపరుస్తుంటారు. అటువంటి ప్రవర్తన దోషమని పండితులు చెబుతున్నారు. మరికొందరు పెద్దల పట్ల ఆదరగౌరవాలతో ప్రవర్తిస్తుంటారు.

అటువంటివారు చరిత్రలో స్థిరంగా నిలిచిపోతారని మనకు అనుభవం మీద తెలుస్తున్న విషయమే.దశరథ మహారాజు దగ్గరకు విశ్వామిత్రుడు వచ్చిన సమయంలో దశరథుడు ఎదురేగి, ఆయనకు స్వాగతం పలికి, ఉచితాసనం చూపిన తరువాతే తాను కూర్చున్నాడు. రాముడు కూడా విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు వెళ్లిన సమయంలో నేల మీద పరున్నాడు. ‘నేను మహారాజ పుత్రుడిని, భావి చక్రవర్తిని’ అనే అహంకారం ఋషుల దగ్గర ప్రదర్శించకూడదనే విజ్ఞతతో ప్రవర్తించారు. అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసి, వారి ఋణం తీర్చుకున్నాడు శ్రవణకుమారుడు. 

కాఠిన్యం స్థావరే కాయే భవతా సర్వమర్పితమ్‌‌ ఇదం తు తే భక్తి నమ్రం సతామారాధనం వపుః(కుమార సంభవం, ఆరవ సర్గ 73 శ్లోకం)  నీచేత కఠినత్వమంతయు శిలయందు ఉంచబడి, నిరంతరం ఆరాధన కోసం స్థావర శరీరంగా అంటే శిలామయంగా ఉంచబడింది. సత్పురుషులకు పూజా సాధనంగా నీ శరీరం అంటే జంగమ స్వరూపముగా ఉన్న ఈ శరీరం భక్తిచే వంగినది. అందువల్ల నీ హృదయము కాఠిన్యము లేనిదిగా తెలుస్తోంది అని కుమారసంభవంలో హిమవంతుడి గురించి సప్త ఋషులు ప్రశంసాపూర్వకంగా పలికినట్లు కాళిదాసు చెబుతున్నాడు.

సాక్షాత్తు హిమవంతుడు సప్తర్షులు వస్తే, వంగి నమస్కరించాడు. అది కూడా భక్తితో వినమ్రంగా నమస్కరించాడు. మణులు, రత్నాలు, సంపదలకు నిలయమైన వాడు హిమవంతుడు. అంటే సంపదలలో లెక్కిస్తే, కోట్లకు పడగలెత్తినవాడు. కాని సాక్షాత్తు సప్తర్షులు తన ఇంటికి వస్తే, అంతటి సంపన్నుడు కూడా వంగి నమస్కరించాడు. సప్తర్షులు సూర్యమండలం కంటే పైన ఉంటారని హిమవంతుడికి తెలుసు. అంతటి మహనీయులు... తన కుమార్తె అయిన పార్వతికి, పరమశివునికిచ్చి వివాహం చేయాలనే సంకల్పంతో సప్త ఋషి మండలం నుంచి దిగి వచ్చారు.
డబ్బు మదంతో పెద్దలను అగౌరవపరచకూడదని హిమవంతుని ద్వారా ఈ ఋషులు మనకు తెలియచేస్తున్నారు.
 
భారతం పరిశీలిస్తే...

దుర్యోధనాదులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించారు.శ్రీకృష్ణ పరమాత్ముడంతటివాడు వచ్చి, కౌరవ సభలో రాయబారం నడుపుతూ, ఎన్నో మంచి మాటలు చెబుతున్న సందర్భంలో, దుర్యోధనుడు సభను విడిచి వెళ్లిపోయాడు. పెద్దలు వచ్చినప్పుడు వారి మాటలను వినాలనే ఇంగితజ్ఞానం లేకపోవడం వల్లనే దుర్యోధనుడు ఆ విధంగా ప్రవర్తించాడు. అంతేనా... కురువృద్ధులు, గురువృద్ధులు, బంధువులు... అందరినీ చులకన చేస్తూ, తానే రారాజునని విర్ర వీగాడు. ద్రౌపది పట్ల తప్పుగా ప్రవర్తించాడు.  అందుకే నూరుగురు కౌరవులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు.

సర్వం తెలిసినవాడు, భగవద్గీతను బోధించినవాడు, అందరిచేత జగద్గురువు అనిపించుకున్నవాడు అయిన శ్రీకృష్ణుడు... భీష్మాచార్యుడు అంపశయ్య మీద ఉన్న సమయంలో, ఆయన చేత ధర్మరాజాదులకు ధర్మబోధ చేయించాడు. ఆయన చెబుతుంటే కృష్ణుడు కూడా వినయంగా విని  చేతులు జోడించి నమస్కరించాడు.
శ్రీకృష్ణదేవరాయలను మంత్రి తిమ్మరుసు చిన్నతనం నుంచి ఎత్తుకుని పెంచాడు. రాజయ్యాక కూడా తిమ్మరుసును గౌరవించాడు రాయలు. మగధ చక్రవర్తి అయిన తరవాత కూడా మౌర్య చంద్రగుప్తుడు తన గురువులైన చాణుక్యుడిని గురుభావంతో పూజిస్తూ, వినయంగా నమస్కరించేవాడు.జ్ఞాన సంపన్నుల నుండి నేర్చుకోవడం వినయ సంపన్నుల వివేకం.
- డా. వైజయంతి పురాణపండఫోన్​ :80085 51232