లండన్: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్, దివంగత డీగో మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ చేసిన మ్యాచ్‌లో వేసుకున్న షర్ట్ వేలంలో రికార్డు స్థాయిలో దాదాపు 71 కోట్ల రూపాయల ధర (7.1 మిలియన్ పౌండ్లు) పలికింది. స్పోర్ట్స్‌కు సంబంధించిన వస్తువుల వేలంలో అత్యధిక ధర ఇదే కావడం విశేషం. ఇంగ్లండ్‌తో జరిగిన1986 ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్‌ఫైనల్లో మారడోనా ఈ జెర్సీ ధరించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా చేతితో చేసిన వివాదాస్పద గోల్ ‘హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్’గా చరిత్రలో నిలిచింది. ఆ మ్యాచ్ తర్వాత డీగో, ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ స్టీవ్ హాడ్జ్ తమ జెర్సీలను పరస్పరం మార్చుకున్నారు. స్టీవ్ హాడ్జ్ కలెక్షన్‌లో ఉన్న ఈ జెర్సీని తాజాగా వేలంలో ఉంచగా.. ఊహించినట్టే రికార్డు ధర వచ్చింది. ఈ వేలానికి ముందు స్పోర్ట్స్‌కు సంబంధించిన వస్తువుల్లో 1892 ఒలింపిక్ మేనిఫెస్టో (ఒరిజినల్ చేతిరాత) 2019లో రూ. 67 కోట్లకు అమ్ముడైంది. తాజాగా మారడోనా షర్ట్ దీన్ని బ్రేక్ చేసింది. అయితే, వేలంలో ఈ షర్ట్‌ను కొన్న వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు.

