
చెన్నై: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. చెన్నై గ్రాండ్ మాస్టర్స్‌లో మరో డ్రా నమోదు చేశాడు. బుధవారం అనిష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దాంతో అర్జున్ నాలుగు పాయింట్లతో టైటిల్ ఆశలను క్లిష్టం చేసుకున్నాడు. మరో రెండు రౌండ్స్ మాత్రమే మిగిలి ఉన్న ఈ టోర్నీలో టైటిల్ గెలవాలంటే విదిత్ గుజరాతీతో జరిగే ఎనిమిదో రౌండ్‌లో అర్జున్ కచ్చితంగా గెలిచి తీరాలి.
జర్మనీ గ్రాండ్ మాస్టర్ విన్సెంట్ కీమర్.. అవోండర్ లియాంగ్ (అమెరికా)పై గెలిచి ఐదున్నర పాయింట్లతో టైటిల్‌కు మరింత చేరువయ్యాడు. మరో గేమ్‌లో కార్తికేయన్.. విదిత్ గుజరాతీపై, నీహల్ సరీన్.. రే రాబ్సన్‌పై గెలిచారు. చాలెంజర్స్‌లో ద్రోణవల్లి హారిక.. హర్షవర్ధన్ జీబీ చేతిలో ఓడింది.