మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న త్రివిధ దళాల థీమ్

మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న త్రివిధ దళాల థీమ్

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్ లో భాగంగా నాలుగు ప్రధాన చౌరస్తాల్లోని ఐలాండ్స్ లో వివిధ థీమ్స్ తో ఏర్పాటు చేసిన ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) బి.రాహుల్ సరికొత్త ఐడియాతో వీటికి రూపకల్పన చేశారు. ముఖ్యంగా బెల్లంపల్లి చౌరస్తాలోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ త్రివిధ దళాలతో కూడిన ప్రతిమలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేలా త్రివిధ దళాల థీమ్ తో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అని అడిషనల్ కలెక్టర్ తెలిపారు.

లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో ప్రకృతి నేపథ్యం, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తాలో కుటీర పరిశ్రమల నేపథ్యంతో ఏర్పాటు చేసిన ప్రతిమలు సైతం అబ్బురపరుస్తున్నాయి. ఈ మూడింటినీ శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు మోతీలాల్, రాహుల్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్ ఓ శివ్ ఆశిష్ సింగ్ తో కలిసి కలెక్టర్ సంతోష్ ప్రారంభించారు. ఐబీ చౌరస్తాలో ఐలాండ్ డెవలప్ మెంట్ పనులు కొనసాగుతున్నాయి. రూ. కోటి 55 లక్షలతో డెవలప్ చేసిన ఐలాండ్స్ జిల్లా కేంద్రానికి కొత్త శోభనిస్తున్నాయి. ప్రజలు ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ సంబురపడుతున్నారు.