పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే.. ప్రభుత్వం ఆదేశిస్తే కలిపేస్తాం: ఆర్మీ చీఫ్

పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే.. ప్రభుత్వం ఆదేశిస్తే కలిపేస్తాం: ఆర్మీ చీఫ్

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమేనని చెప్పారు భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్. జమ్ము కశ్మీర్ పూర్తిగా మనదేనని ఎప్పటి నుంచో పార్లమెంటు తీర్మానం ఉందని, అది నిజం కావాలని పార్లమెంటు కోరితే సాకారమైపోతుందని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆర్డర్స్ వస్తే అప్పుడు తాము బరిలోకి దిగుతామని చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వెంట ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. భారత ఆర్మీ ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తుందని, పాకిస్థాన్‌లా అనాగరికంగా సామాన్యులపై కాల్పులకు దిగడం లాంటివి చేయదని, శత్రువును నేరుగా ఎదుర్కొంటామని అన్నారు మనోజ్ ముకుంద్. తమ దృష్టిలో చొరబాట్లు తాత్కాలిక ముప్పు అయితే, యుద్దం పెద్ద సమస్య అని, ఈ రెండింటినీ ఎదుర్కొనేందుకు తాము సమర్థంగా ఎదుర్కోగలమని చెప్పారు.

100 మంది మహిళా జవాన్లకు శిక్షణ

పాక్‌తో పాటు చైనా సరిహద్దుల్లోనూ సమానంగా దృష్టి పెట్టాల్సి ఉందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఈ విషయంలో సైన్యాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నామని చెప్పారు. చైనా ఆర్మీ వెస్ట్రన్ కమాండ్‌తో త్వరలో భారత మిలటరీ ఆపరేషన్స్ డీజీకి హాట్ లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సరిహద్దు వెంట ఏ సమస్యలు రాకుండా రెండు దేశాల మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుందన్నారు మనోజ్ ముకుంద్. జమ్ము, కశ్మీర్ సహా సరిహద్దులో ఉన్న ప్రతి సైనికుడూ నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, ప్రజలు సపోర్ట్ తమకు ఉందని అన్నారాయన. మిలటరీ పోలీసు విభాగాల్లోకి త్వరలో మహిళల్ని తీసుకోబోతున్నట్లు తెలిపారు. జనవరి 6న తొలి బ్యాచ్ కింద 100 మంది మహిళా జవాన్లకు శిక్షణ మొదలైందని చెప్పారు ఆర్మీ చీఫ్.