ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు... 12 ఏళ్ళ బాలుడు అరెస్ట్..

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు... 12 ఏళ్ళ బాలుడు అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ( జులై 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఐదు ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం రేపింది . దీంతో అధికారులు వేగంగా స్కూళ్లను ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు చేపట్టారు అధికారులు. ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇది వరుసగా మూడో రోజు కాగా.. ఇప్పటిదాకా వచ్చిన బెదిరింపులు అన్నీ ఫేక్ అని తేల్చారు పోలీసులు. ఫేక్ బెదిరింపులకు పాల్పడ్డ 12 ఏళ్ళ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.

ఇవాళ ఉదయం వేరువేరు సమయాల్లో 5 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఉదయం 5 :26 గంటలకు ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్ కి బెదిరింపులు వచ్చాయని.. ఆ తర్వాత 6: 30 గంటలకు వసంత్ కుంజ్ లోని వసంత్ వ్యాలీ స్కూల్ కి, 8 : 12 గంటలకు హౌజ్ ఖాస్ లోని మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ కి, 8: 11 నిమిషాలకు వెస్ట్ విహార్ లోని రిచ్ మాండ్ స్కూల్ కి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలిపారు అధికారులు. విషయం తెలుసుకున్న వెంటనే స్కూళ్లకు చేరుకున్న భద్రతా బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారని.. ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులు లభించలేదని స్పష్టం చేశారు అధికారులు.

ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి యాజమాన్యాలు. మొత్తం మీద, ఇటీవల కాలంలో ఢిల్లీలోని తొమ్మిది పాఠశాలలకు ఇటువంటి పది బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు తెలిపారు అధికారులు. స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ అన్ని ఫేక్ అని తేల్చిన అధికారులు అనుమానాస్పద వస్తువులేవి లభించలేదని స్పష్టం చేశారు.