మళ్లీ ఎన్డీఏలో జాయిన్ అవ్వండి: షిండే ముందే ఉద్ధవ్ థాక్రేకు CM ఫడ్నవీస్ ఓపెన్ ఆఫర్

మళ్లీ ఎన్డీఏలో జాయిన్ అవ్వండి: షిండే ముందే ఉద్ధవ్ థాక్రేకు CM ఫడ్నవీస్ ఓపెన్ ఆఫర్

ముంబై: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కావాలనుకుంటే ఉద్ధవ్ థాక్రే తిరిగి మళ్లీ అధికార ఎన్డీఏ కూటమిలో చేరవచ్చని ఫడ్నవీస్ ఆహ్వానం పలికారు. ప్రత్యర్థిని తిరిగి తమతో కలవాలని ఫడ్నవీస్ ఆహ్వానించడం మహారాష్ట్ర పాలిటిక్స్‎లో కొత్త చర్చకు దారి తీసింది. బుధవారం (జూలై 16) శాసన మండలిలో శివసేన థాకరే వర్గం సభ్యుడు అంబదాస్ దన్వేకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘ఉద్ధవ్ జీ 2029 వరకు మేము ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం లేదు. కానీ మీరు ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలో చేరాలనుకుంటే చేరొచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. ఒకసారి ఆలోచించండి’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఉద్ధవ్ థాక్రే కూడా అక్కడే ఉన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో నవ్వులు పూశాయి. అన్ని పార్టీల సభ్యుల పగలబడి నవ్వారు. 

ఫడ్నవీస్ కామెంట్స్‎పై స్పందించిన ఉద్ధవ్ థాక్రే.. ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవద్దని వాటిని తేలికగా తీసుకోవాలన్నారు. కాగా, ఉద్ధవ్ థాక్రే గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో విభేదాలు రావడంతో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చి ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా అలయెన్స్‎తో కలిసి పని చేస్తున్నారు. 

ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రస్తుతం బీజేపీతో కలిసి అధికారంలోకి ఉంది. కానీ షిండే తీరుపై బీజేపీ అసంతృప్తిగా ఉన్నట్లు మహారాష్ట్ర పాలిటిక్స్‎లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ వర్గాన్ని దగ్గర చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పాత మిత్రుడు థ్రాకేను మళ్లీ తిరిగి రావాలని ఫడ్నవీస్ కోరడంతో ఉద్ధవ్ వర్గం బీజేపీతో కలవబోతుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఇటీవల సీఎం ఫడ్నవీస్, ఉద్ధవ్ థాక్రే కూడా ఒకరినొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకోవడం కూడా ఇందుకు సంకేతాలు అని చర్చలు జరుగుతున్నాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో  తన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను అదుపులో ఉంచడానికి కూడా ఫడ్నవీస్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని మహా పాలిటిక్స్‎లో టాక్స్ వినిపిస్తున్నాయి. సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఏక్‌నాథ్ షిండే ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు.