
- ఇంఫాల్‌లోని మార్కెట్ స్థలం విషయంలో గొడవ
- రంగంలోకి ఆర్మీ, పారా మిలటరీ బలగాలు కర్ఫ్యూ విధించిన అధికారులు
గౌహతి: గొడవలు సర్దుమణిగి ప్రశాంతంగా మారుతున్న మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతానికి చెందిన మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య సోమవారం మధ్యాహ్నం కొట్లాట మొదలైంది. ఆందోళనకారులు న్యూ లాంబులేన్ ప్రాంతంలోని ఖాళీగా ఉన్న ఇండ్లకు నిప్పంటించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. భద్రతా బలగాలను మోహరించింది. హింసాత్మక ఘటనలు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఘర్షణ జరిగిన ఏరియాలో అధికారులు కర్ఫ్యూ విధించారు. అంతకుముందు సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూను సడలించగా దానిని రద్దు చేశారు. ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సమాచారం తెలియగానే ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. స్థానిక మార్కెట్ జాగ విషయంలో గొడవ మొదలైనట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు.
నాగా, కుకీ తెగల ఆందోళనలు..
మణిపూర్‌లో మైతీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌కు వ్యతిరేకంగా నాగా, కుకీ తెగలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల పాటు సాగిన హింసాకాండలో 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు తగలబడ్డాయి. వేలాది మంది ఇండ్లను వదిలి ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకున్నారు. హింసను అదుపు చేసేందుకు కొద్దిరోజులుగా సైన్యం, పారామిలటరీ బలగాలు రాష్ట్రంలో మోహరించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జోక్యంతో పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య గొడవ మొదలవడంతో మణిపూర్‌లో మరోసారి
టెన్షన్ వాతావరణం నెలకొంది.