ఆగ్రో రైతు సేవ కేంద్రాల్లోనే విత్తనాలు కొనాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఆగ్రో రైతు సేవ కేంద్రాల్లోనే విత్తనాలు కొనాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. మంగళవారం నల్గొండలోని గడియారం వద్ద తెలంగాణ విత్తన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్టె ఎరువులు, విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరకు ఆశపడి అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దన్నారు.

రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసి రాయితీపై పంపిణీ చేస్తుందని తెలిపారు. వివిధ రకాల విత్తనాలు బ్లాక్ మార్కెట్​లో అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, రైతుల బయోమెట్రిక్ నమోదు చేసి విత్తనాలు ఇవ్వాలని డీలర్లకు చెప్పారు. రానున్న వ్యవసాయ సీజన్లలో సన్నబియ్యం ఎక్కువగా అవసరం ఉందన్నారు.

ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని సన్నబియ్యం విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎవరైనా ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారి పత్యానాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండకూడదు

డిండి, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని చెరుకుపల్లి, కామేపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బాలూనాయక్ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ్, డీసీఎస్ వో వెంకటేశ్, ఆర్డీవో రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.