
కాశ్మీర్ ప్రకృతి అందాలను తిలకించాలని వెళ్లిన పర్యాటకులను పహల్గాంలో ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపడంతో ప్రతి భారతీయుడు తీవ్ర ఆవేదనతో రగిలిపోయాడు. అభం శుభం తెలియని 26 మందిని వారి కుటుంబ సభ్యులముందే హతమార్చడం వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని తేలడంతో, ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతదేశం ఏకతాటిపై నిలిచి ప్రభుత్వానికి అండగా నిలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది.
ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్ సైనికులు ఆపరేషన్ సిందూర్ పేరుతో ఆ దేశంపై చేసిన దాడులపై దేశ ప్రజలందరూ గర్వించారు. సిందూర్ మెరుపు దాడులతో పాకిస్తాన్‌ను తోకముడిచేలా చేసిన ఘనత మన సైనిక దళాలదే. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న వాతావరణం చూస్తుంటే 1971లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధ ఘటనలు కూడా దేశ ప్రజల మదిలో మెదులుతున్నాయి.
కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు అడపాదడపా జరుగుతూనే ఉన్నా అక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆ భరోసాతో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. అయితే, కాశ్మీర్‌పై నిత్యం కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు భద్రతా దళాలు లేనిది చూసుకొని పచ్చని పర్వతాలు, మైదానాలతో మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పహల్గాంలో అమానుషంగా కాల్పులు జరిపి 26 మందిని బలితీసుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ దేశ భద్రతే ప్రాధాన్యతగా పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.
పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పేలా భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ అధినేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా పార్టీ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించి మేమంతా ఒక్కటే అనే గట్టి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి సంఫీుభావం ప్రకటించారు.
పాక్‌పై దాడికి కాంగ్రెస్ మద్దతు
పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాద ఘటన జరిగిన అనంతరం మే 6వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత భారత దళాలు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేయడంతో ప్రతీకారంతో రగులుతున్న యావత్ దేశ ప్రజలు మన సైన్య రంగాన్ని చూసి గర్వపడ్డారు. భారత్ సైనిక దాడులతో బెంబేలెత్తిన పాకిస్తాన్ తన ఉనికి చాటుకోవడానికి సాధరణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం సిగ్గుచేటు. . మన సైనికులు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే పాకిస్తాన్ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది.
దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు తీవ్రమైన దశలో అధికారికంగా యుద్ధం ప్రకటించకపోయినా యుద్ధ వాతావరణమే కొనసాగింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు తమ వంతు బాధ్యతగా మద్దతిచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారత్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా పాకిస్తాన్ మళ్లీ భారత్‌వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా ఆ దేశాన్ని శిక్షించాలని కోరింది. దేశంలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
మోదీ ప్రసంగంలో నిరాశ
కాల్పుల విరమణపై దేశంలో మిశ్రమ స్పందన నెలకొనడంతో తొలుత అధికారులచే, అనంతరం త్రివిధ దళాల అధిపతులచే వివరణలొచ్చాయి. చివరికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సందేశమిస్తూ పహల్గాం దాడులు, అనంతరం ఆపరేషన్ సిందూర్, మన సైనిక బలగాల విజయాలు వివరిస్తూ పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో కాల్పులు ఆపామన్నారు. దిగివచ్చిన పాకిస్తాన్‌కు ఎలాంటి షరతులు విధించారో మోదీ చెప్పలేదు. టెర్రరిస్టు స్థావరాలకు పుట్టినిల్లయిన పాకిస్తాన్లో వాటిని ధ్వంసం చేయడానికి ఆ దేశం ఎటువంటి చర్యలు తీసుకోనుంది అనే వాటిపై స్పష్టత వస్తుందని సగటు భారతీయుడు ఆశించినా మోదీ ప్రసంగంలో నిరాశే ఎదురైంది.
ఆపరేషన్ సిందూర్‌తో దూసుకుపోతున్న భారత సైనికుల కదనరంగాన్ని చూస్తే 1971లో ఉక్కు మహిళగా పేరుగాంచిన నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో భారత సైనిక దళాలు పాకిస్తాన్‌తో చేసిన యుద్ధం ఘటనలు గుర్తుకొస్తున్నాయి. భారత్ ఆ యుద్ధంలో పాకిస్తాన్లోకి చొచ్చుకొనిపోయి 15 వేల చదరపు కిలోమీటర్లకుపైగా ఆ దేశ భూమిని స్వాధీనం చేసుకుంది. 90 వేలకుపైగా పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఇందిరా గాంధీ వ్యూహాలతో బంగ్లాదేశ్ స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.
ఇందిరా గాంధీ తీరు దేశానికి ఆదర్శం
పాకిస్తాన్ ఆంతరంగిక విషయాల్లో భారత్ జోక్యం చేసుకుంటే ఊరుకోమని అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బెదిరిస్తే ఇందిరాగాంధీ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ‘ఇండియా అమెరికాను ఒక స్నేహితునిగా పరిగణిస్తుంది కానీ ఒక యజమానిగా కాదు. తన భవిష్యత్తును నిర్మించుకునే శక్తి ఇండియాకు ఉంది. పరిస్థితులను బట్టి ఎలా వ్యవహరించాలో మాకు బాగా తెలుసు’ అని అమె చెప్పడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.
1971లో పాకిస్తాన్‌తో అమెరికాతో ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు మన దేశానికి నిత్యం ఆదర్శమే. అప్పుటి ఉక్కుమహిళ ఇందిరాగాంధీలా ఇప్పుడు నరేంద్ర మోదీ అమెరికాపై దృఢమైన వైఖరి తీసుకోవాలి. దేశంలో అంతర్గత రాజకీయాలు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిచ్చి దేశభద్రతే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ నిరూపించుకుంది. ప్రతిపక్షాలు తమ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించిన వేళ ప్రభుత్వం కూడా అంతే బాధ్యతతో వ్యవహరించాలి. అఖిలపక్షంతో పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలి. దేశ రక్షణే ధ్యేయంగా పోరాడుతూ పాకిస్తాన్‌ను మట్టికరిపిస్తున్న భారత సైన్యానికి సెల్యూట్.
ప్రధాని మోదీ నిర్ణయంపై ఆందోళన
రెండు దేశాల మధ్య నాలుగు రోజులు తీవ్రంగా దాడులు జరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు ఉపయోగిస్తున్న సీఆర్పీఎఫ్ దళాలను కూడా కేంద్రం దేశ సరిహద్దులకు తరలించింది. ఉద్రిక్తతలు కొనసాగుతున్నవేళ 10వ తేదీన మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతి ఉగ్రవాద దాడిని ఒక యుద్ధంగానే పరిగణిస్తాం’ అని హెచ్చరించడంతో అధికారికంగా యుద్ధం ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది.
అయితే, అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇండియా, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయనే ప్రకటనతో యావత్ దేశంలో ఆశ్చర్యంతోపాటు గందరగోళం కూడా నెలకొంది. ప్రత్యక్షంగా తలపడుతున్న భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణపై ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాల మధ్య సయోధ్యకు తాను ఒప్పించానని, రెండు దేశాలు కాల్పుల విరమణకు ఆమోదించాయని ట్వీట్ చేశారు. అనంతరం పాకిస్తాన్, భారత్ ప్రభుత్వాలు అధికారికంగా ఇదే విషయాన్ని ప్రకటించాయి. భారత్ సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న దశలో మన ప్రభుత్వం కాల్పుల విరమణకు ఎటువంటి అంగీకారంతో ముందుకొచ్చిందనే ప్రశ్నలు యావత్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
- బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు-