
హనుమకొండ, వెలుగు: హనుమకొండలో ని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 23వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందని కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. ఆర్మీలో చేరాలనుకునేవారికి ఇదివరకే ఆన్ లైన్ లో అగ్ని వీర్ పరీక్ష నిర్వహించారని, అందులో ఉత్తీర్ణులైన వారికి జేఎన్ఎస్ లో వివిధ టెస్టులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణపై హనుమకొండ కలెక్టరేట్ లో ఆర్మీ, పోలీస్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో బుధవారం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
ముందుగా సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ అగ్ని వీర్ ఆన్ లైన్ టెస్టులో దాదాపు 9 వేల మంది ఉత్తీర్ణులయ్యారని, వారందరికీ హనుమకొండ జేఎన్ఎస్ లో రన్నింగ్ తోపాటు ఫిజికల్, మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. స్టేడియంలో అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అన్నిశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో వైవీ.గణేశ్, ఆర్మీ మేజర్ ప్రకాశ్ రాయ్, ఆర్మీ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
నవరాత్రుల లోపు పనులు పూర్తి చేయాలి
కాశీబుగ్గ: భద్రకాళి అమ్మవారి నవరాత్రుల లోపు మాడ వీధుల్లోని పనులను పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్అన్నారు. బుధవారం సిటీలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాడ వీధుల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కలెక్టర్ వెంట ఈవో సునీత, కుడా అజీత్ రెడ్డి, సీఐ కారుణాకర్ తదితరులున్నారు.