విలీనమా..వేరే గ్రూపా? ‘కారు’ దిగేందుకు రెడీగా మరో 22 మంది ఎమ్మెల్యేలు

విలీనమా..వేరే గ్రూపా?  ‘కారు’ దిగేందుకు రెడీగా మరో 22 మంది ఎమ్మెల్యేలు
  •     ‘కారు’ దిగేందుకు రెడీగా మరో 22 మంది బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు 
  •     ఇప్పటికే కాంగ్రెస్​లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు 
  •     గ్రూప్​గా ఉంటే బీఆర్​ఎస్​ ఎల్పీని దక్కించుకునే చాన్స్​
  •     కేసీఆర్​కు ప్రతిపక్ష నేత హోదా కూడా గాయబ్​!
  •     విలీనమే బెస్ట్​ అంటున్న కొందరు ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ పార్టీని వీడేందుకు దాదాపు మరో 22  మంది ఎమ్మెల్యేలు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ముగ్గురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరారు. వీరితోపాటు మిగిలిన 22 మందిని కలిపితే బీఆర్​ఎస్​ను వీడే ఎమ్మెల్యేల సంఖ్య 25కు చేరనుంది. వీరంతా అధికార పార్టీ శాసనసభా పక్షంలో విలీనం కావడంపై కాంగ్రెస్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిటికల్​ సర్కిల్స్​లో టాక్​ వినిపిస్తున్నది. బీఆర్​ఎస్​ఎల్పీని పూర్తిగా సీఎల్పీలో విలీనం చేయడమా లేకుంటే వేరే గ్రూప్​గా ఉండడమా అనే దానిపై వీళ్లంతా సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. లెజిస్లేచర్​ పార్టీని విలీనం చేయాలంటే గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు బయటకు రావాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 2/3 వంతు మంది (దాదాపు 26 మంది) ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వీళ్లంతా అసెంబ్లీ స్పీకర్‌‌కు లేఖ ఇస్తే, ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్‌‌ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్‌‌లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం 25 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు(ఇప్పటికే ముగ్గురు బీఆర్​ఎస్​ను వీడారు) బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. 

ఇంకో ఒక ఎమ్మెల్యే కూడా మారేందుకు సిద్ధమైతే విలీనం చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే విలీనం కాకుండా.. తమను వేరే గ్రూప్​గా గుర్తించాలని, తమదే అసలైన బీఆర్​ఎస్​ ఎల్పీ అని అసెంబ్లీ స్పీకర్​ను ఈ ఎమ్మెల్యేలు కోరే చాన్స్​ కూడా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ఇదే జరిగితే.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఈ గ్రూప్​కే వస్తుంది. అందులో ఉండే ఎమ్మెల్యేకే లీడర్​ ఆఫ్​ అపొజిషన్​ దక్కుతుంది. ఫలితంగా ప్రతిపక్ష నేత హోదాను కూడా కేసీఆర్​ కోల్పోవాల్సి వస్తుంది. అయితే వేరు గ్రూప్​గా ఉంటే భవిష్యత్​లో పొలిటికల్​ ఈక్వెషన్స్​ ఎలా ఉంటాయనే తెలియదని, విలీనమే బెస్ట్​ అని కొందరు అనుకుంటున్నట్లు తెలిసింది. 

నాడు బీఆర్​ఎస్​ చేర్చుకుందిలా..

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నది. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్‌‌కు చెందిన ఐదుగురిని, వైసీపీకి చెందిన ముగ్గురిని, బీఎస్పీకి చెందిన ఇద్దరిని, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యేను బీఆర్ఎస్‌‌లో చేర్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున గెలిచిన  19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో జాయిన్​ చేసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను, మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. 

నాడు 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్‌‌లో చేరగానే కాంగ్రెస్‌‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్‌‌కు కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్​, తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మరో 22 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కూడా ‘కారు’ దిగేందుకు రెడీ అవుతున్నట్లు టాక్​.