నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. గురువారం రాత్రి 7 గంటలకు ఎలక్షన్ క్యాంపెయిన్ ముగియడంతో రూల్స్ప్రకారం నాన్ లోకల్ లీడర్లు నియోజకవర్గాన్ని ఖాళీ చేశారు. సుమారు 4, 5 వారాలుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాష్ట్ర స్థాయి లీడర్లు, ఇన్చార్జిలంతా మిర్యాలగూడ, నల్గొండ, దేవరకొండ పట్టణాలకు మకాం మార్చారు. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్‌ల్లో తిష్టవేసి తదుపరి యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతున్నారు.
నెలరోజులకు పైగా టీఆర్ఎస్ ప్రచారం
సాగర్ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడక ముందే ఫిబ్రవరి 10న సీఎం కేసీఆర్ ప్రచారభేరి మోగించారు. ఆ తర్వాత మార్చి8 నుంచి ఈ నెల 15 వరకు టీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ఏకధాటిగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సెకండ్ క్యాడర్ లీడర్లు సాగర్‌లోనే మకాం వేసి, ఇల్లిల్లూ తిరిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు నేతృత్వంలోనే ఎలక్షన్ క్యాంపెయిన్ప్లానింగ్, యాక్షన్ప్లాన్అమలయ్యాయి. ఒకరకంగా సగానికి సగం కేబినెట్‌ను టీఆర్ఎస్ హైకమాండ్నియోజకవర్గంలో దింపింది. కులాలవారీగా ఓట్లపై కన్నేసి, ఏ మండలంలో ఏ కులస్థులు ఎక్కువుంటే ఆ కులానికి చెందిన లీడర్ప్రచారంలో ఉండేలా చూసుకుంది. ఉద్యోగుల ఓట్ల కోసం ఉద్యోగ సంఘాల లీడర్లను సైతం దింపడం విశేషం. హోంమంత్రి మహ్మద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రచారం చివరి అంకంలో 14న సీఎం కేసీఆర్ మరోసారి హాలియాలో బహిరంగ సభ నిర్వహించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
తరలివచ్చిన కాంగ్రెస్ హేమాహేమీలు
కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ లీడర్జానారెడ్డి ఒకరకంగా ఈ ఎన్నికల్లో చావో, రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. రెండేళ్ల నుంచి సాగర్‌పై దృష్టిపెట్టిన జానారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా అందరికంటే ముందే ప్రారంభించారు. ఆయన కొడుకులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి తో పాటు నియోజకవర్గంలోని మరికొందరు సీనియర్లు ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత జానా రెడ్డి జనగర్జన పేరుతో హాలియాలో పెట్టిన సభ సక్సెస్ కావడం ఆ పార్టీ శ్రే ణుల్లో ఊపుతెచ్చింది. పీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆర్.దామోదర్ రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు తమ వంతుగా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొని రూలింగ్పార్టీ విమర్శలు, ఆరోపణలకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.
ఇక ప్రలోభాలు.. బెట్టింగుల జోరు
శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రచారం ముగియడంతో ఆయా పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. ఈసీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ, నల్గొండ, దేవరకొండ పట్టణాలకు మకాం మార్చిన లీడర్లంతా హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్‌లలో తిష్టవేసి తమ క్యాష్, లిక్కర్ పంపిణీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంతా ఒక ప్లాన్ ప్రకారం ఏరియాలవారీగా ఉన్న తమవాళ్లకు ఫోన్లలో డైరెక్షన్ ఇస్తున్నారు. పనిలో పనిగా కోవర్టు ఆపరేషన్లు కూడా కొనసాగిస్తున్నారు. ఓటుకు ఎంత ఇయ్యాలే అనేదానిపైన ప్రధాన పార్టీల్లో శుక్రవారం ఉదయం దాకా చర్చ నడిచింది. కాగా, శుక్రవారం ఉదయం నుంచే పలుచోట్ల ఓటుకు వెయ్యి, క్వార్టర్ బాటిల్ పంపిణీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఇక ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తా రనే దాని పైన జోరుగా బెట్టింగులు నడుస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల ఏర్పాట్లలో ఆఫీసర్లు బిజీ
శనివారం జరగనున్న పోలింగ్ కోసం ఆఫీసర్లు ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషు లు 1,09,228, మహిళలు 1,11,072 మంది ఉన్నారు. మొత్తం 346 పో లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 5,535 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో ఎన్నికల సిబ్బంది 3,145 మందికాగా, 2,390 మంది పోలీసులు ఉన్నారు. 17న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8,151 కాగా 1,433 మంది ఓట్లు వేశారు. కోవిడ్ పేషెంట్లకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటేసే అవకాశం కల్పించారు. ఎన్నికల్లో భాగంగా రూ.45 లక్షల నగదు, రూ.46 లక్షల విలువ చేసే లిక్కర్ సీజ్ చేసినట్లు, 362 మంది పై వివిధ కేసులు నమోదు చేసినట్లు పోలీస్ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, పోలింగ్ రోజున నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు.
ప్రచారంలో బీజేపీ జోరు
ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ ప్రచారంలోనూ జోరు కొనసాగించింది. ఎన్నికల ఇన్చార్జి సంకినేని వెంకటేశ్వరరావు, చాడ సురేశ్‌రెడ్డి, మీడియా మేనేజ్మెంట్కమిటీ చైర్మన్ గంగడి మనోహర్ రెడ్డి నేతృత్వంలో విజయవంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ లీడర్లు మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి, విజయశాంతి, ఇ.పెద్దిరెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలవి కుమ్మక్కు రాజకీయాలంటూ తరుణ్‌చుగ్ చార్జిషీట్ రిలీజ్ చేస్తే, కిషన్ రెడ్డి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడం విశేషం.
సాగర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: సీఈవో శశాంక్
ఈ నెల 17న జరగనున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో శశాంక్ గోయల్ గురువారం మీడియాకు తెలిపారు. క్యాంపెయిన్‌లో కరోనా నిబంధనల ఉల్లంఘనలపై 116 కేసులు నమోదు చేశామని, ఇందులో అన్ని పార్టీలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ సమయంలోనూ కరోనా రూల్స్ పాటించేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని చెప్పారు. ఈ ఎన్నికలో 3,145 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కింద 13 కేసులు వచ్చాయని, ఇప్పటి వరకు రూ.46.79 లక్షల నగదును సీజ్ చేశామని చెప్పారు. రూ.45 లక్షలు విలువ చేసే 7,424 లీటర్ల లిక్కర్ సీజ్ చేశామని తెలిపారు. కరోనా పాజిటివ్ ఉన్నవారు పీపీఈ కిట్లతో వచ్చి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని శశాంక్ గోయల్ చెప్పారు.
