మహబూబ్​నగర్ లో కౌంటింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు

మహబూబ్​నగర్ లో కౌంటింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు
  • తేలనున్న 200 మంది అభ్యర్థుల భవితవ్యం
  • ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు
  • ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు, అబ్జర్వర్లు

మహబూబ్​నగర్​, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. గురువారం పోలింగ్​ ముగియగా, ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గెలుపోటములపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజల్ట్స్​ డే కావడంతో ఆదివారం ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తేలనున్న 200 మంది భవితవ్యం​

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల నుంచి 200 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అత్యధికంగా కల్వకుర్తిలో 24 మంది, జడ్చర్లలో 15, దేవరకద్రలో 12, మక్తల్​లో 11, వనపర్తిలో 13, గద్వాలలో 20, అలంపూర్​లో 13, నాగర్​కర్నూల్​లో 15, అచ్చంపేటలో 14, షాద్​నగర్​లో 14, కొల్లాపూర్​లో 14, కొడంగల్​లో 13, నారాయణపేటలో ఏడుగురు, మహబూబ్​నగర్​లో 15 మంది ఉన్నారు. వీరి భవితవ్వం ఆదివారం మధ్యాహ్నంతో  తేలిపోనుంది.

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏ సామాజిక వర్గాల ఓట్లు ఎవరికి పడ్డాయి? ఏ గ్రామంలో ఎక్కువగా ఓట్లు పోల్​ అయ్యాయి? అవి ఏ పార్టీకి పోల్​ అయ్యాయి? ఇండిపెండెంట్​ క్యాండిడేట్లు ఉన్న చోట ఎక్కడెక్కడ ఓట్లు చీలాయి? ఓట్లు చీలడంతో ఎవరికి ఫాయిదా జరుగుతుంది? అనే లెక్కలు వేసుకున్నారు. 

కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి

కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఆయా జిల్లాల ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్​ కేంద్రాల్లోకి ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. మహబూబ్​నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను పాలమూరు యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 20 రౌండ్ల చొప్పున ఓట్లను లెక్కించనున్నారు. మహబూబ్​నగర్  నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 7 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్​ కోసం ఏర్పాటు  చేశారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 20 రౌండ్ లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పోస్టల్ బ్యాలెట్​కు రెండు టేబుల్స్​ ఏర్పాటు చేశారు.

దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి 21 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా,14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నారాయణపేట, మక్తల్​ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్​ సెంటర్లను నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని  శ్రీదత్త బృందావన్​ బీఎడ్​ కాలేజీలో, వనపర్తి కౌంటింగ్​ కేంద్రాన్ని వనపర్తి జిల్లా సమీపంలోని కొత్త మార్కెట్​యార్డు గోదాముల వద్ద, గద్వాల, అలంపూర్​ నియోజకవర్గాల కౌంటింగ్​ కేంద్రాలను గద్వాల పాలిటెక్కిక్​ కాలేజ్​ ఆవరణలో, నాగర్​కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్​ నియోజకవర్గాల కౌంటింగ్​ కేంద్రాలను నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డు గోదాముల వద్ద ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మహబూబ్​నగర్​ కలెక్టర్​ జి.రవినాయక్ తెలిపారు. కలెక్టరేట్ లో  కౌంటింగ్  సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అబ్జర్వర్లు​జి .రష్మీ, రఘురామ్ అయ్యర్ లతో కలిసి మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించారు. అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి తప్పు జరగకుండా చూడాలన్నారు. రిటర్నింగ్ అధికారులు అనిల్ కుమార్, ఎస్. మోహన్ రావు, ఎన్.నటరాజ్, 
డీఎఫ్ వో సత్యనారాయణ  పాల్గొన్నారు. 

గద్వాల : కౌంటింగ్ లో పొరపాటు జరగకుండా జాగ్రత్త గా పని చేయాలని గద్వాల కలెక్టర్  వల్లూరు క్రాంతి సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో మైక్రో అబ్జర్వర్లు, తహసీల్దార్లు, కౌంటింగ్  సూపర్​వైజర్లకు పలు అంశాలను రిటర్నింగ్ అధికారులతో కలిసి వివరించారు. కౌంటింగ్ ఏజంట్ల సమక్షంలో కంట్రోల్  యూనిట్  స్విచ్ ఆన్  చేసి నమోదైన ఓట్లు, ఫారం 17సీలో నమోదైన ఓట్లు సరిచూసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్  అపూర్వ్ చౌహాన్ , అలంపూర్  ఆర్వో చంద్రకళ, అడిషనల్  కలెక్టర్  శ్రీనివాస్  పాల్గొన్నారు.

 నాగర్ కర్నూల్ టౌన్ : నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల కౌంటింగ్  కేంద్రాలను నాగర్​కర్నూల్​ కలెక్టర్  ఉదయ్ కుమార్  పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్  హాళ్ల మధ్య ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్​ కలెక్టర్లు కుమార్ దీపక్,  కె సీతారామారావు, ఆర్వోలు వెంకట్ రెడ్డి, గోపీరాం ఉన్నారు.

నారాయణపేట : ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నారాయణపేట కలెక్టర్  కోయ శ్రీహర్ష తెలిపారు. కౌంటింగ్  సెంటర్  ఏర్పాట్లను అబ్జర్వర్​ బీపీ చౌహాన్ తో కలిసి  పరిశీలించారు. అడిషనల్​ కలెక్టర్  మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్, ఏవో నర్సింగరావు, తహసీల్దార్​ రాణా ప్రతాప్  పాల్గొన్నారు.

వనపర్తి : అబ్జర్వర్​ సోమేశ్​మిశ్రా, కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  కౌంటింగ్​ ఏర్పాట్లను పరిశీలించారు. 14 టేబుల్స్ కు కౌంటింగ్ సిబ్బందిని కేటాయించారు. అదనంగా మరో 20 శాతం  సిబ్బందిని స్పేర్ లో ఉంచినట్లు చెప్పారు.