నిజామాబాద్ జిల్లాలో ‘స్థానిక’ సమరానికి రెడీ.. 18 జడ్పీటీసీ, 177 ఎంపీటీసీలకు నోటిఫికేషన్

నిజామాబాద్ జిల్లాలో ‘స్థానిక’ సమరానికి రెడీ.. 18 జడ్పీటీసీ, 177 ఎంపీటీసీలకు నోటిఫికేషన్
  • నేటి నుంచి ఫస్ట్​ ఫేజ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్లు
  •  కామారెడ్డి జిల్లాలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ, 
  •  నిజామాబాద్ జిల్లాలో 18 జడ్పీటీసీ, 177 ఎంపీటీసీలకు నోటిఫికేషన్​ 
  •   ఆశావహుల లిస్టు రెడీ చేస్తున్న ప్రధాన పార్టీలు

నిజామాబాద్​/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ‘స్థానిక’ సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో ఎన్నికలు జరిగే  జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం నుంచి  నామినేషన్లు స్వీకరించనున్నారు. స్టేట్​ ఎలక్షన్​ కమిషన్​ (సీఈసీ) ఇది వరకే ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్లు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు.  ఇందుకు సంబంధించి ఆర్​వోలకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చి మెటీరియల్ సిద్ధంగా పెట్టారు. 11 తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించి 12న స్ర్కూట్నీ తర్వాత అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారు. 

లిస్టుపై 13న ఆప్పీళ్లు తీసుకొని 14న పరిష్కరిస్తారు. 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్​డ్రాకు అనుమతించి ఆదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 23న పోలింగ్​ నిర్వహించి నవంబర్​ 11న కౌంటింగ్​ చేపడతారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ,  233 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో ఫస్ట్ విడతలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  నిజామాబాద్​ జిల్లాలో మొత్తం 31 జడ్పీటీసీ స్థానాలుండగా, మొదటి విడతలో 18 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాల్లో 177కు ఎన్నికలు జరుగనున్నాయి.  

ఇవీ ఫస్ట్​ ఫేజ్​ మండలాలు..

కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు,  బీబీపేట, దోమకొండ,  గాంధారి, కామారెడ్డి,  లింగంపేట, మాచారెడ్డి,  పాల్వంచ, రామారెడ్డి, రాజంపేట,  సదాశివనగర్,  తాడ్వాయి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు ఉన్నాయి.నిజామాబాద్​ జిల్లాలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, ధర్పల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నవీపేట, నిజామాబాద్, సిరికొండ మండలాలు ఉన్నాయి.

అభ్యర్థుల ఎంపికకు కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల లిస్టు రెడీ అవుతోంది.  ఉమ్మడి జిల్లాలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న కాంగ్రెస్, బీఆర్​ఎస్,  బీజేపీ నేతల వివరాలు ఇది వరకే సేకరించారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై  హైకోర్టులో  బుధవారం విచారణ ఉత్కంఠ రేపింది.  గురువారం నోటిఫికేషన్​ జారీ చేయనుండగా, అభ్యర్థులను ఫైనల్​ చేయడంపై రాజకీయ పార్టీలు  ఫోకస్ పెట్టాయి. 

కాంగ్రెస్​ తరఫున జడ్పీటీసీకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారిలో  రిజర్వేషన్లకు అనుగుణంగా ఒక్కో స్థానంలో 3 నుంచి ఐదుగురి పేర్లతో కూడితో లిస్టును అదిష్టాన వర్గానికి పంపారు.  రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న  దృష్ట్యా పోటీకి పలువురు ఆసక్తి చూపుతున్నారు. బీజేపీ,  బీఆర్​ఎస్ కూడా  అభ్యర్థుల లిస్టు తయారు చేయడంలో నిమగ్నమైంది. ఎంపీటీసీ స్థానాల​కు పోటీ చేసే వారి వివరాలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన పార్టీల ఆశావహులు ముఖ్య నేతలను ఆశ్రయిస్తున్నారు.