రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం .. ఉత్సవాలకు ముస్తాబైన సిర్సనగండ్ల ఆలయం

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం .. ఉత్సవాలకు ముస్తాబైన  సిర్సనగండ్ల ఆలయం

వంగూరు, వెలుగు: చారకొండ మండలంలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల గుట్టపై కొలువుతీరిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ  చైర్మన్  రామ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గుట్టపై 200 వెహికల్స్​ పార్కింగ్  చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 17 న  ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, వేద పారాయణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. 18న స్వామి వారికి అభిషేకం, అర్చన, వేద పారాయణం, కుంకుమార్చన, రాత్రి చిన్న రథం పూలతేరు ఉంటుంది. 

 19న ఏకాదశి అభిషేకం, అర్చన, శివ, దత్తాత్రేయ, పరుశరామ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు, రాత్రికి గరుడసేవ, పెద్దతేరు నిర్వహించనున్నారు. 20న రాత్రి పెద్ద రథోత్సవం, 21న పల్లకీ సేవ, అభిషేకం, నాగబలి, పూర్ణాహుతి, 22న అభిషేకం, రాత్రికి పల్లకీ సేవ, చక్రతీర్థం, ఏకాంతసేవ, ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. 

ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ

సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సోమవారం ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్  సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ చైర్మన్  రామ శర్మ, ఈవో నిరంజన్, ప్రధాన అర్చకులు లక్ష్మణ శర్మకు పలు సూచనలు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, సౌలతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రవి పాల్గొన్నారు.