రష్యా హ్యాకర్ హెల్ప్.. ఎగ్జామ్లో 820 మంది చీటింగ్

రష్యా హ్యాకర్ హెల్ప్.. ఎగ్జామ్లో 820 మంది చీటింగ్

దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల సాఫ్ట్ వేర్ గతేడాది హ్యాక్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో రష్యాకు చెందిన 25 ఏళ్ల మిఖాయిల్ షార్గిన్ ను అక్టోబరు 3న (సోమవారం)  సీబీఐ అరెస్టు చేసింది. అతడిని ఇవాళ ఢిల్లీలోని ఓ కోర్టులో  ప్రవేశపెట్టగా రెండు రోజుల పాటు సీబీఐ  కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఈ కేసులో 24 మందిని అరెస్టు చేశారు. రష్యా హ్యాకర్ మిఖాయిల్ షార్గిన్ జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే దాదాపు 820 మంది అభ్యర్థులకు సహాయం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో సీబీఐ గుర్తించింది.   

కోర్టులో వాదోపవాదనలివీ..

కేసుతో ముడిపడిన మరిన్ని వివరాలు చెప్పేందుకు షార్గిన్ నిరాకరిస్తున్నాడని కోర్టుకు సీబీఐ తెలిపింది.షార్గిన్ ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ అని.. అభ్యర్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వినియోగించే ‘ఐలియోన్’ సాఫ్ట్ వేర్ ను అతడు హ్యాక్  చేశాడని పేర్కొంది. దీనిపై షార్గిన్ స్పందిస్తూ.. ‘‘నా దగ్గరున్న ఎలక్ట్రానిక్ డివైజ్ లను సీబీఐకి చూపించడానికి సిద్ధం. అయితే వాటిని నా సమక్షంలోనే తనిఖీ చేయాలి’’ అని న్యాయ స్థానానికి చెప్పాడు. ఆయా ఎలక్ట్రానిక్ డివైజ్ ల యూజర్ నేమ్ లు, పాస్ వర్డ్ లను ఇచ్చేలా షార్గిన్ ను ఆదేశించాలని కోర్టును సీబీఐ న్యాయవాది కోరారు. 

నేపథ్యం ఇదీ..

జేఈఈ మెయిన్ పరీక్షల సాఫ్ట్ వేర్ హ్యాక్ అయిన  వ్యవహారం గతేడాదే వెలుగులోకి వచ్చింది. దీంతో మిఖాయిల్ షార్గిన్ భారత్ విడిచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు క్రమంలో అతడిపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిఖాయిల్ షార్గిన్ అక్టోబరు 3న కజకిస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చాడు.  ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడిని నిలువరించి, సీబీఐ అధికారులకు అప్పగించారు.