కరీంనగర్​లో కొనసాగుతున్న అరెస్టులు

కరీంనగర్​లో కొనసాగుతున్న అరెస్టులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ సిటీలో భూవివాదాలు సృష్టించి, అక్రమ వసూళ్లకు పాల్పడిన కేసులో పోలీసులు మరో ముగ్గురు కార్పొరేటర్ల భర్తలను అరెస్ట్​చేశారు. ఇదే కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు. బుధవారం అరెస్టయిన వారిలో 25 డివిజన్ కిసాన్ నగర్ కార్పొరేటర్ సరిత భర్త ఎడ్ల అశోక్, రెండో డివిజన్​తీగలగుట్టపల్లి కార్పొరేటర్ లావణ్య భర్త కాశెట్టి శ్రీనివాస్, 20వ డివిజన్​ఆర్టీసీ కాలనీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి భర్త తుల బాలయ్య ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం..

కరీంనగర్ వివేకానందపురికి చెందిన గవర్నమెంట్ టీచర్ మామిడి రవీందర్ రెడ్డి తీగలగుట్టపల్లి శివారులోని సర్వే నెంబర్ 240/Aలో గోపడి సుగుణమ్మ, గోపడి రాజుకు చెందిన 2.14 ఎకరాల నుంచి 744 గజాల భూమిని 2004లో కొనుగోలు చేశాడు. ఇదే భూమి నుంచి మూల అరుణాదేవి 1.20 గుంటలు, ఎన్నం రాజిరెడ్డి 20 గుంటల భూమిని కొనుగోలు చేశారు. రవీందర్ రెడ్డి 2017లో గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని తన హద్దుల్లో ప్రహరీ, షెడ్డును నిర్మించుకున్నాడు. అరుణాదేవి తన భూమిని 26 ప్లాట్లుగా చేసి ఇతరులకు అమ్మేసింది. ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఇతర జిల్లావాసులని గ్రహించిన రెండో డివిజన్ కార్పొరేటర్ భర్త కాశెట్టి శ్రీనివాస్.. ఎలాగైనా భూ వివాదం సృష్టించి, యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడాలని భావించాడు. బాలయ్య, అశోక్ తో కలిసి రవీందర్ రెడ్డిని బెదిరించారు. ఒక్కో ప్లాటుకు రూ.3 లక్షల చొప్పున ఇవ్వాలని, లేదంటే సదరు భూమిని శ్మశాన వాటికగా మారుస్తామని చెప్పారు. డబ్బు ఇవ్వకపోవడంతో ఆ భూమికి వెళ్లే 40 ఫీట్ల రోడ్డులోని హనుమాన్ నగర్, కిసాన్ నగర్, చంద్రపురి కాలనీ వాసులను పురిగొల్పారు. భూమిని స్మశాన వాటికగా ఉపయోగించేలా ప్రోత్సహించారు. 2019 జనవరిలో ఎడ్ల అశోక్, మాజీ వార్డ్ మెంబర్ అల్లిబిల్లి నగేశ్​కలిసి రవీందర్ రెడ్డి నిర్మించిన గోడ, షెడ్ ను జేసీబీ ద్వారా కూల్చివేశారు. అంతేగాక ఇది ప్రభుత్వ భూమి అని బెదిరింపులకు పాల్పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో మామిడి రవీందర్ రెడ్డి, గాలిపల్లి రాజమౌళి, ఏలేటి రఘుపతి రెడ్డి అనే ముగ్గురు బాధితులు తలా రూ.లక్ష చొప్పున ఎడ్ల అశోక్ కు ముట్ట చెప్పారు.

మిగతావారు డబ్బు ఇవ్వకపోవడంతో 2020 నవంబర్, డిసెంబర్ లో ఖాళీ ప్లాట్లలో శవాల దహన సంస్కారాలు నిర్వహించారు. శివరాత్రి సమ్మయ్య జేసీబీతో వారి భూమికి వెళ్లేదారిలో అక్రమంగా గుంతలు తీయించారు. అది ప్రభుత్వభూమి అని బెదిరింపులకు దిగారు. బాధితులు ప్రభుత్వ సర్వేయర్​తో సర్వే నిర్వహించగా, అది ప్రభుత్వ భూమి కాదని ప్రైవేటు భూమిని తేలింది. ఈ క్రమంలో మామిడి రవీందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కార్పొరేటర్ల భర్తలు ఎడ్ల అశోక్, కాశెట్టి శ్రీనివాస్, తుల బాలయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. శివరాత్రి సమ్మయ్య, అల్లిబిల్లి నగేశ్​పరారీలో ఉన్నారు.