ఆధారాలు లేకుండానే అరెస్టులు.. యాంత్రికంగా రిమాండ్​లు!

ఆధారాలు లేకుండానే అరెస్టులు.. యాంత్రికంగా రిమాండ్​లు!

పోలీసులు ఇచ్చిన రిమాండ్​ రిపోర్టులో చూసిన కారణాల్లో తగిన బలం చాలా ఉందని మేజిస్ట్రేట్​భావించినప్పుడే సెక్షన్​167 సీఆర్​పీసీ ప్రకారం రిమాండ్​ చేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి రిమాండ్ రిపోర్టులను గమనించినప్పుడు మేజిస్ట్రేట్స్​యాంత్రికంగా రిమాండ్​చేస్తున్నట్టు అనిపిస్తుంది. పోలీసులు స్వతంత్రంగా పనిచేయడం లేదన్నది జగద్విదితం. స్వతంత్రంగా వ్యవహరించే పోలీసు వ్యవస్థ ఉండాలని ప్రతిపక్షాలు సహా అందరూ కోరుకుంటున్నారు. కానీ వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పోలీసులు స్వతంత్రంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దర్యాప్తు చేసే పోలీసు విభాగం వేరుగా ఉండాలి. బలంగా ఉండాలి. శాస్త్రీయ పద్ధతుల్లో నేర పరిశోధన చేసే నైపుణ్యం కలిగి ఉండాలి.  ప్రకాశ్​సింగ్ ​కేసులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శాంతి భద్రతలు నిర్వహించే పోలీసులకు దర్యాప్తు చేసే పోలీసులకు మధ్య పూర్తి విభజన ఉండాలని సూచించింది. దర్యాప్తు చేసే పోలీసుల మీద ఇతర పనిభారాలు ఉండకూడదు. 

కానీ ఏండ్లు గడుస్తున్నా ఈ దిశగా ఏమాత్రం పురోగతి లేదు. వైట్​కాలర్​ నేరాలను విచారించే పోలీసులకు ఎలాంటి నైపుణ్యం లేకుండా పోతున్నది. క్రిమినల్​ప్రొసీజర్​కోడ్​లోని సెక్షన్​157 ప్రకారం నేరం జరగగానే ఎఫ్ఐఆర్​ను విడుదల చేసి నేరస్థలాన్ని సందర్శించాలి. అక్కడ అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించాలి. ఆ తర్వాత అవసరమని భావించినప్పుడు ముద్దాయిని అరెస్ట్​చేయాలి. ముద్దాయి అరెస్ట్​అనేది చట్టం దృష్టిలో చివరి దశ. సాక్ష్యాలను సేకరించిన తర్వాత అవసరమని భావించినప్పుడు మాత్రమే అరెస్ట్​ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ కేసు దర్యాప్తు చూసినా ఉల్టాపల్టాగా ఉంటుంది. ముందు ముద్దాయిని అరెస్ట్​ చేస్తున్నారు. ఆ తర్వాత సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అరెస్టును రొటీన్​గా చేయకూడదని, అరెస్ట్​చేసే అధికారం ఉండటం ఒక ఎత్తు, దానికి న్యాయబద్ధత ఉండటం మరో ఎత్తు అని సుప్రీంకోర్టు జోగిందర్ ​కుమార్​ కేసులో ఎప్పుడో చెప్పింది.

 కానీ పోలీసుల్లో ఎలాంటి గుణాత్మకమైన మార్పు కనిపించడం లేదు. అరెస్ట్​అనేది దర్యాప్తులో ముఖ్యమైన అంశంగా వాళ్లు భావిస్తున్నారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించకుండానే పోలీసులు ముద్దాయిలను అరెస్ట్​ చేసి రెండు తెల్లకాగితాలను నల్లగా చేసి రిమాండ్ ​రిపోర్టు రాసి మేజిస్ట్రేట్​వద్దకు పంపిస్తున్నారు. రిమాండ్​ చేయడం అనేది యాంత్రికమైన చర్యకాదు. మేజిస్ట్రేట్​తీసుకునే న్యాయబద్ధమైన చర్య. ఈ రిమాండ్​అభ్యర్థనలను తప్పనిసరిగా సీఆర్​పీసీలోని సెక్షన్​41, రాజ్యాంగంలోని ఆర్టికల్​21లను పరిగణనలోకి తీసుకొని వాటిని గీటురాయిగా చూసి నిర్ణయం తీసుకోవాలి. 

రెండు ఫలితాలు

సతీందర్​కుమార్​ఆంటిల్​కేసులోని మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల రెండు రకాలైన ఫలితాలు ఉంటాయి. మొదటిది అవసరం లేని వ్యక్తులను కస్టడీకి పంపించడం, రెండవది కొత్త కేసులను సృష్టించడం. వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. ఈ తీర్పులో నిర్దేశించిన ఆదేశాలను ధిక్కరిస్తూ మేజిస్ట్రేట్స్​ఉత్తర్వులు జారీ చేస్తుంటే వారికి ఈ జ్యుడీషియల్​వర్క్​ను ఇవ్వడం ఆపి వారి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు జ్యుడీషియల్​అకాడమీల్లో శిక్షణ ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు  సూచించింది.​ తీర్పులు ఎన్ని ఉన్నా వాటిని అర్థం చేసుకోని పాటించే న్యాయమూర్తుల సంఖ్య పెరిగిపోతుంది. చాలా మంది జ్యుడీషియల్​ మేజిస్ట్రేట్​లకు అనుభవం తక్కువ. న్యాయవాదులుగా ప్రాక్టీస్​ లేకుండానే నియమితులవుతున్న వ్యక్తుల సంఖ్య ఎక్కువ. మెట్రోపాలిటన్​నగరమైన హైదరాబాద్​లో సీనియర్ ​సివిల్​జడ్జి హోదాలో ఉన్న న్యాయమూర్తులను మేజిస్ట్రేట్లుగా నియమిస్తున్నారు. ఈ విధంగా మిగతా ప్రధాన నగరాల్లో నియమించాలి. అంటే అప్​గ్రేడ్​ చేయాలి. అప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడొచ్చు. అయినా న్యాయమూర్తులందరికీ నిరంతర శిక్షణ అవసరం. పోలీసులకు కూడా. జ్యుడీషియల్​అకాడమీలు ఆ దిశగా కృషి చేయాలని ఆశించడం తప్ప చేయగలిగిందేమీ లేదు. తెలిసి తప్పులు చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు కూడా ఉండాలి. అప్పుడే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు అవుతాయి. 

సుప్రీం మార్గదర్శకాలు

ఒక ఫన్నీ ఫేస్​బుక్ ​పోస్టుపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్​ ఇండియా(మార్క్సిస్ట్​, లెనినిస్ట్) ఆఫీసు బేరర్​పై నమోదైన ఎఫ్ఐఆర్​ను మద్రాస్​ హైకోర్టు(మధురై బెంచ్) రిమాండ్​కోరగానే రిమాండ్ ​చేయకూడదన్న ఆసక్తికరమైన పరిశీలన చేసింది. ‘షూటింగ్​కోసం సిరుమలైకి ట్రిప్పు’ అని ఫేస్​బుక్​లో వెకేషన్​ పిక్చర్​ను క్యాప్షన్ ​చేసినందుకు పోలీసులు 62 ఏండ్ల వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపించారు. ఆ రిమాండ్​ను అరుణ్​అన్న మేజిస్ట్రేట్​తిరస్కరించారు. అతనిపై ఐపీసీలోని 120బీ, 122, 505(1)(బీ), 507 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపించారు. ఆ రిమాండ్​ను మేజిస్ట్రేట్​తిరస్కరించారు. తగిన కారణాలు లేవని ఆ మేజిస్ట్రేట్​తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విధంగా తిరస్కరించేటప్పుడు సుప్రీంకోర్టు ‘స్టేట్ వర్సెస్​నక్కీరన్(2019)’ కేసును ఉదహరించారు. ఈ ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. రిమాండ్​ను జ్యుడీషియల్​మేజిస్ట్రేట్​సరిగ్గా తిరస్కరించారని, అతనిపై మోపిన కేసు అసంబద్ధమైనదని, చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం అని హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్​తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. ఆ మేజిస్ట్రేట్​న్యాయబద్ధంగా వ్యవహరించనందు వల్ల ఆ కేసులోని ముద్దాయి జైలుకు వెళ్లడం, బెయిల్​కోసం దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించని మేజిస్ట్రేట్స్​ను గమనించి సుప్రీంకోర్టు సతీందర్​ కుమార్​​ వర్సెస్​ సీబీఐ అండ్​అదర్స్​2023 లైవ్​లా(సుప్రీంకోర్టు)233 కేసుతో చాలా తీవ్రమైన  పరిశీలనలను చేసింది.

మేజిస్ట్రేట్లకు తెలియకపోవడమా!


అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిందితులను కస్టడీకి పంపించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్​రా ష్ట్రం నుంచి ఈ రిమాండ్​లు ఎక్కువ అవుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల గమనించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్​కిషన్​కౌర్​, అహ్సనుద్దీన్​ అమానుల్లా, అరవింద్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం(సతీందర్​కుమార్​ వర్సెస్ ​సీబీఐ, 2022 లైవ్​లా(సుప్రీంకోర్టు) 577లో) అరెస్టు, కస్టడీల గురించి, బెయిల్ ​గురించి మార్గదర్శకాలను ఏర్పరిచిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. అరెస్టు, కస్టడీ, బెయిల్​మంజూరు గురించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఏర్పరచి 10 నెలలు గడుస్తున్నప్పటికీ మేజిస్ట్రేట్లు వాటిని ఉల్లంఘిస్తూ కస్టడీ, రిమాండ్ ​ఉత్తర్వులను జారీ చేయడం పట్ల సుప్రీం బెంచ్​ ఆగ్రహం వ్యక్తపరిచింది. ఈ కేసులో ముద్దాయిల వైపున హాజరవుతున్న న్యాయవాదులు ఎన్నో రిమాండ్​ఉత్తర్వులను కోర్టుకు సమర్పించారు. ఈ తీర్పు సంగతే మేజిస్ట్రేట్​లకు తెలియదని వారు కోర్టుకు వివరించారు.
మంగారి రాజేందర్​,జిల్లా సెషన్​జడ్జి (రిటైర్డ్​)