
కొంతకాలంగా నేను గమనిస్తోన్న ఒక విషయం నన్ను కలచివేస్తోంది. ఆ విషయం బ్రేకింగ్ న్యూసో, వైరల్ వీడియోనో, పేపర్ హెడ్ లైనో కాదు. కానీ, జనాలు మాట్లాడుకునే, ప్రవర్తించే, తమను తాము పోల్చుకునే లేదా పోల్చుకోలేని పద్ధతుల్లో ఉంది నేను గమనిస్తోన్న ఆ విషయం. మనమంతా క్రమంగా ఒక లో ట్రస్ట్ సొసైటీగా మారిపోతున్నాం. అదే నన్ను బాధిస్తోంది. పచ్చిగా మాట్లాడుకుందాం. మన దేశం ఎన్నడూ ఇలా లేదు.
హిందూ నాగరికత తరాలుగా విశ్వాసపూరిత సమాజంగా ఉండేది. మన కుటుంబాల్లో, సంఘంలో, మన సంస్థల్లో ‘శ్రద్ధ’ అనే ఒక పవిత్రమైన విశ్వాసంతో ఎదిగాం. మన సంప్రదాయ విలువలు సత్యశీలత, నిజాయితీ, నిరాడంబరతను ప్రోత్సహించాయి. కానీ, కాలక్రమంలో పెరుగుతోన్న ప్రపంచీకరణ, దిగుమతి చేసుకున్న సంస్కృతులు, అదుపులేని పెట్టుబడిదారీ విధానంలో పడి, మన సౌకర్యాల కోసం మేధస్సునూ, గుర్తింపు కోసం విలువలనూ, వినియోగదారీతనం కోసం సంస్కృతినీ పణంగా పెట్టాం. ఇయ్యాల గతంలో ఎన్నడూ లేనంత బలంగా మన ఇంటి తలుపులు బిగించుకునే, గడియ పెట్టుకునే స్థితికి వచ్చాం. అవేకాదు, మన మనసుకూ, సామాజిక సంబంధాలకూ కూడా తాళాలు వేసేశాం. ‘నమ్మకం’ అనేది అరుదైన వస్తువైపోయింది.
పక్కవారు మనల్ని తొక్కేస్తారనే అభద్రతతో ఉండే సమాజం.. తొక్కేస్తారేమోనని కాదు, తొక్కేస్తారు అని బలంగా నమ్మే సమాజం! పక్కింటివారిని నమ్మరు. కార్యాలయాల్లో తోటివారి పట్ల అనుమానం, సంస్థలన్నీ స్వీయ లాభాలు ఆర్జించేవిగానే చూస్తారు. ఇప్పుడు మనకు అవిశ్వాసం అనేది సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రహస్య ఎజెండా ఉందనే ఊహతో, పారదర్శకత అనేది మిథ్య అనీ, వ్యవస్థలన్నీ మోసపూరితమనీ భావించే స్థితికి వచ్చేశాం. దీన్నేం మనం మసిపూసి దాచక్కర్లేదు. ఆ లక్షణాలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నాయి.
ఎదుటివారిపై అపనమ్మకం, అనుమానం అనేవి కొందరికే పరిమితమైన లక్షణాలు కావిప్పుడు, మనం బతకాలంటే అదొక సాధనం. నాయకులంటే అబద్ధాలే చెప్తారు, వ్యాపారులు మోసాలే చేస్తారు, కొత్తవారిని మనం నమ్మకూడదు అనే జనం బలంగా నమ్ముతున్నారు. సంభాషణలు స్వేచ్ఛగా కాకుండా ఆచితూచి జరుగుతున్నాయి. బంధాలన్నీ లావాదేవీలుగా నాకేంటి అన్న ధోరణిలోకి వచ్చేశాయి.
ప్రతి అడుగూ, ప్రతి మాటా లెక్క వేసుకుని, తూకం వేసుకుని, పరిణామాలను అంచనా వేసుకునే చేస్తున్నారు. కుటుంబాల్లో కూడా భావాలు ఎండిపోయి, బంధాలు పలచబారుతున్నాయి. మాటలు ఆవేశంగా, గట్టిగా ఉంటున్నాయి. కానీ, అవి ప్రేమతో కాదు చిరాకుతో. అరిస్తే తప్ప మాట వినరని అనుకునే స్థితికి వచ్చేశారు.
సున్నితత్వం బలహీనతగా..
సున్నితంగా చెప్పడం అంటే బలహీనత అనుకుని భ్రమిస్తున్నారు. ఎప్పుడు పరస్పర నమ్మకాలు పోతాయో అప్పుడు.. చట్టాలు-, వ్యవస్థలు ముందుకు వస్తాయి. అందుకే నిబంధనలు, ఒప్పందాలు, పర్యవేక్షణలు, నిఘాలు, చట్టపరమైన వ్యవస్థల మీద ఆధారపడడం పెరుగుతుంది.
ఎందుకంటే జనం స్వతహాగా మంచి పనులు చేస్తారని, మంచిగా ఉంటారని మనం నమ్మం. ఇది అసమర్థతే కాదు, (సమాజం పట్ల) మనల్ని అలసిపోయేలా చేస్తుంది. దీనివల్ల ఆర్థికంగా కూడా భారమే. లో ట్రస్ట్ సమాజం అసమర్థత, న్యాయ వివాదాలు, ఆలస్యాలకు కారణమై సమాజాన్ని క్షీణింపజేస్తోంది.
వ్యాపారస్తులు వ్యాపారాన్ని పెంచుకోవడం కంటే తమను కాపాడుకోవడానికి ఎక్కువ సమయం వృథా చేయాల్సి వస్తోంది. పెట్టుబడిదారులు వెనకా ముందు ఆడతారు. మేధస్సు బయటకు వెళ్ళిపోతుంది. సమన్వయం, సహకారం నశిస్తుంది. అనుమానపు నీడలో ఆవిష్కరణలు నశిస్తాయి.
సామాజికంగా ఇది అధ్వాన పరిస్థితి. సంఘంలో జీవితం విచ్ఛిన్నం అవుతుంది. స్వచ్ఛంద సేవకు ప్రజలు ముందుకురారు, సాయపడరు, పక్కవారితో కలవడమే మానేస్తారు. పక్కవారిపై ఆదరణ, ఆప్యాయత లెక్కలేసుకునే జరుగుతుంది. క్రమంగా అవినీతి, నిజాయితీ లేకపోవడం, సొంతలాభం మాత్రమే మామూలు విషయంగా మారి, అదే సరికొత్త సంస్కృతిగా దాపురిస్తుంది.
ఇలా ఎందుకు జరుగుతోంది?
ఇదంతా రాత్రికి రాత్రి జరిగింది కాదు. వ్యవస్థల వైఫలం, పెరుగుతున్న అసమానతలు, అదుపు లేని అవినీతి, పడిపోతున్న సంస్కృతిల కలయికల ఫలితం ఇది. పాలకుల వరుస మోసాలు.. ఎవర్నీ నమ్మలేని స్థితికి చేర్చాయి ప్రజల్ని. విస్తృత ప్రజా ప్రయోజనం, సమాజం మొత్తానికి మేలు అనే మాటలు కొట్టుకుపోయాయి.
స్వార్థం పెరగడమే కాదు, దాన్ని సమర్థించుకుంటున్నారు కూడా. ఆర్థిక అసమానతలు దీన్ని మరింత పెంచాయి. ఎప్పుడైతే ప్రజలు ఆర్థికవృద్ధికి దూరం అయ్యారో, వారికి అందాల్సినంత అందడం లేదని నమ్మారో వారు పారదర్శకతను నమ్మడం మానేశారు. ఒకరినొకరు నమ్మడం మానేశారు.
ధనవంతులను పేదలు ఆగ్రహంతో చూస్తారు. ఇక మధ్యతరగతి? వారు మధ్యలోనే ఉన్నారు. అటు పేదలను, ఇటు ధనవంతులనూ ఇద్దరినీ నమ్మరు. దీనికి అదనంగా సమాజం చీలిపోవడం చూస్తున్నాం. రాజకీయ, సైద్ధాంతిక యుద్ధాలు, అవతలివారి కష్టాలలో సైతం అయ్యోపాపం అనలేని స్థితిని తెచ్చేశాయి.
అర్థం చేసుకోవడం కోసం కాకుండా, గెలవడం కోసం వాదిస్తున్నారిప్పుడు. సోషల్ మీడియా దీన్ని మరింత దిగజార్చింది. పిడివాదం ప్రతిధ్వనించే యంత్రాలయ్యారు మనుషులు. మన బుర్రల్లోని సామూహిక చారిత్రక భారం నేపథ్యం కూడా చూడాలి. సామ్రాజ్యవాదం, ఆక్రమణలు, రాజకీయ మోసాల గాయాలను మనం తరాలుగా మోస్తున్నాం. కానీ, మనం వాటిని నయంచేసే బదులు, పూడ్చిపెట్టాం. ఆ మానని గాయం కుళ్లి.. స్వార్థంగా, అప నమ్మకంగా మారింది.
ఈ ధోరణి మార్చడం ఎలా?
ఇది పైనుంచి మార్చగలిగేది కాదు. ఇది సంస్కృతిలో భాగం. మార్పు కింది నుంచి రావాలి. జనంలో నుంచి రావాలి. నీ పొరుగువారితో ఎలా మాట్లాడుతావు, నీ కింది వారిని ఎలా చూస్తావు, నీ పిల్లలను ఎలా పెంచుతావు అనే దానిలో ఉంటుంది. నీ మాట నిలబెట్టుకోవడం, నీ తప్పులను అంగీకరించడం, నీకు కష్టమైనా న్యాయంవైపు నిలబడడంలో ఉంటుంది.
ఒక హై ట్రస్ట్ సొసైటీలో బతకాలని నువ్వనుకుంటే, నువ్వు ముందుగా హై ట్రస్ట్ వ్యక్తిగా మారాలి. అప్పుడే సంస్కృతి మారుతుంది. ఒకసారికి ఒక మాట, ఒక ఎంపిక, ఒక బంధం వలె.. మనం లో ట్రస్ట్ సమాజంగా మిగిలిపోతామంటే నేను అంగీకరించను .
విశ్వాసం అనే మన వారసత్వాన్ని మనం తిరిగి పొందగలం, పొందాలి. అది మనకు తప్పనిసరి అవసరం. విశ్వాసం లేకుండా సంఘం లేదు, సహకారం లేదు, నాగరికతే లేదు. అవిశ్వాసాన్ని సాధారణీకరించడం ఆపుదాం. ధైర్యంగా, జాగరకూతతో, ప్రయత్నపూర్వకంగా మనం కోల్పోయిన దాన్ని తిరిగి నిర్మిద్దాం.
మరిప్పుడేం చేయాలి?
ఇదిక మామూలే అని అంగీకరించి ముందుకు సాగాలా? కచ్చితంగా కాదు. విశ్వాసాన్నిమళ్లీ నిర్మించగలం అని నమ్ముతున్నాను. కానీ, పెద్ద పెద్ద ఉపన్యాసాలూ, పైకి కనిపించే చర్యల వల్ల సాధ్యంకాదు. కళ్లకు కనిపించే నిరంతరాయమైన వ్యవస్థాగత,- వ్యక్తిగత మార్పుల వల్ల అది జరుగుతుంది. మనకు పారదర్శక పాలన కావాలి.
పాలకులు జవాబుదారీగా ఉండడం ప్రజలు చూడాలి. సమానత్వం మాత్రమే కాదు, సమధర్మం కావాలి. సమ్మిళిత, సాధికార, ఉన్నతి వైపు నడిపించే రాజకీయాలు కావాలి. సామాజిక బంధాలు కావాలి.అడ్డుగోడలు కాదు.. చర్చించుకునే, సహకరించుకునే వేదికలు కావాలి. మానవత్వాన్ని రుచి చూసేందుకు ప్రజలకు అవకాశం కావాలి.
- కె. కృష్ణ సాగర్ రావు,బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి, నేషనల్ బిల్డింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు -