దేశంలో ఇంకా తీరని తాగునీటి కొరత!

దేశంలో ఇంకా తీరని  తాగునీటి కొరత!

జల్ జీవన్ మిషన్  కింద 2024 నాటికి  దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతి ఇంటికి కుళాయి  నీరు అందించాలని  కేంద్రం  లక్ష్యంగా  పెట్టుకొని పని ప్రారంభించింది.  మన దేశంలోని  పల్లెల్లో  సుమారు 19.36 కోట్ల ఇళ్లు ఉన్నాయి.  అయితే,  ఈ ఏడాది  ఫిబ్రవరి నాటికి వాటిలో 79.79 శాతం  గృహాలకు  మాత్రమే  కుళాయి నీరు అందుతోంది.  ఈ నేపథ్యంలో  మిషన్  గడువును  కేంద్రం 2028 వరకూ పెంచింది.  

ప్రస్తుతం తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్,  హర్యానా, పంజాబ్  రాష్ట్రాల్లో ఉన్న పల్లె ప్రాంతాల్లో  నూరుశాతం  గృహాలకు  కొళాయి  నీరు అందుతున్నట్టు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆశయం గొప్పదే అయినప్పటికీ  చాలా రాష్ట్రాల్లో ఈ అవకాశం అందరికీ దక్కడం లేదు. దీనికి సంబంధించి  లోక్​సభలో  కేంద్రం  వెల్లడించిన  వివరాల ప్రకారం  మణిపూర్​లో  79.59 శాతం  గృహాలకు,  ఒడిశాలో 76.42,  ఆంధ్రప్రదేశ్​లో 73.76 ,  మధ్య ప్రదేశ్​లో  67.28,  రాజస్థాన్​లో  55.36,  జార్ఖండ్​లో 54.66,  పశ్చిమ బెంగాల్​లో 54.48,  కేరళలో 54.42 శాతం ఇళ్లకు  మాత్రమే  కుళాయి  నీటి వసతి అందుబాటులోకి వచ్చింది.

గోవాలో వందశాతం కుళాయి నీరు

కేంద్ర  ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో  దేశంలోని  ప్రతి గ్రామీణ ఇంటికీ  తాగునీటిని  అందించడానికి  2019  ఆగస్టు  నుంచి జల్ జీవన్ మిషన్​ను  అమలు చేస్తోంది.  ప్రారంభంలో కేవలం 3.23 కోట్ల (16.7 శాతం) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి లభ్యత ఉంది. 

ఈ ఏడాది మార్చి 17 నాటికి రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన వివరాల ప్రకారం 12.30 కోట్ల  అదనపు  పల్లె ప్రాంత కుటుంబాలకు  నీటి  కనెక్షన్లు అందించారు. ఈ విధంగా  దేశంలోని 19.36  కోట్ల  గ్రామీణ కుటుంబాలలో 15.53 కోట్లకు పైగా (80.20 శాతం) గృహాలకు  కుళాయి నీటి సరఫరా ఉంది.  మిగిలిన 3.83 కోట్ల ఇళ్లకు సంబంధించిన పనులు ప్రణాళిక ప్రకారం వివిధ దశల్లో ఉన్నాయి.  

ఈ మిషన్ అంచనా వ్యయం రూ.3.60 లక్షల కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ. 2.08 లక్షల కోట్లు.  ప్రధాని  మోదీ ఈ మిషన్​ను 2019  ఆగస్టు 15న ప్రారంభించారు.  పూర్తి ఫలితం సాధించిన రాష్ట్రంగా గోవా నిలిచింది . 2.3 లక్షల కుటుంబాలకు వందశాతం కుళాయి నీటిని అందించిన ఘనత సాధించింది.  జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు 9,32,440 పాఠశాలలకు, 9,69,585 అంగన్వాడీ  కేంద్రాలకు నీటి వసతి కలిగింది.

గ్రామీణ కుటుంబాలకు జీవన సౌలభ్యం

ఏళ్ల తరబడి నీళ్లు మోసుకురావడం మహిళలకు ఇబ్బందిగా ఉండేది. ఈ శ్రమ నుంచి విముక్తులను చేయడానికి, వారి ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ మిషన్ కృషి చేస్తోంది.  గ్రామీణ కుటుంబాలకు జీవన సౌలభ్యాన్ని కూడా తీసుకు వస్తోంది . జల్ జీవన్ మిషన్ అమలు చేయడం ద్వారా గ్రామీణ జీవితంలో గణనీయ మెరుగుదలను తెచ్చిపెట్టింది. 

దేశంలోని అన్ని గృహాలకు సురక్షిత తాగునీటిని అందించడం వల్ల సుమారు నాలుగు లక్షల మంది అతిసార మరణాల నుంచి తప్పించుకోగలిగినట్టు  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అలాగే మహిళలు నీటికోసం వెచ్చించే సమయం రోజుకు 5.5 గంటలు ఆదా అవుతాయని పేర్కొంది. మిషన్ ముందుకు సాగుతున్నకొద్దీ గ్రామీణ భారత దేశం ఆరోగ్య దేశంగా మారుతుంది.

 జీవితాలను ప్రభావితం చేస్తుంది . జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.  అయితే రాష్ట్రాలవారీగా చూస్తే మిషన్ సాధించవలసింది చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే 2028 వరకూ గడువు పెంచిన కేంద్రం ఆ లోపునైనా పనులు పూర్తి చేయాలి. మళ్లీ మళ్లీ గడువు పెంచుకుంటూ పోవడం వల్ల ఆశయం నెరవేరకపోగా వ్యయ ప్రయాసలు పెరిగిపోతాయి.

- జి. యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్​-