ఆదిలాబాద్ కు అగ్రనేతల క్యూ

ఆదిలాబాద్ కు అగ్రనేతల క్యూ
  •     ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి, 24న ఏక్ నాథ్ షిండే రాక
  •     బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారో నో క్లారిటీ
  •     జన సమీకరణే పార్టీలకు పెద్ద సవాల్ 

ఆదిలాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలు కావడంతో రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఆయా పార్టీల అగ్రనేతలు జిల్లాకు తరలిరానుండడంతో  అసలైన ఎన్నికల సందడి షురూ కానుంది. ఆది నుంచి ఆదిలాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక, ఆ తర్వాత సీఏం అయ్యాక తొలి సభను ఇంద్రవెల్లిలోనే పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో ఈ నెల 22న  నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరు కానున్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈసభ జరగనుంది.

కార్యకర్తల్లో జోష్​..

ఇప్పటికే  ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో పుంజుకోవడం లోక్ సభ ఎన్నికలకు కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. సీఎం సభతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరగనుంది. తనపై సీఎం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సీతక్క తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆదివాసీ గూడెలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే ఎన్నిల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున లీడర్లు హస్తం పార్టీలో చేరారు. సీఎం సమక్షంలోనూ పలువురు లీడర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

నగేశ్ కు మద్దతుగా షిండే ప్రచారం..  

ఈ నెల 24న బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్​తరఫున ప్రచారం చేసేందుకు మహారాష్ట్ర సీఏం ఏక్ నాథ్ షిండే రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సభకు ఆ పార్టీ అసంతృప్తి నేతలు హాజరువుతారా? లేదా? అన్నది ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రచారం మొదలు పెట్టినప్పటికీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు బయటకు రావడం లేదు. దీంతో ప్రచార సభపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఇప్పటికే అగ్రనేతల ప్రచార షెడ్యుల్ ఖరారు కాగా బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరు వస్తారనేది క్లారిటీ రాలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మంత్రి సీతక్క, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి మధ్యప్రదేశ్ ఇన్​చార్జి మురళీధర్ రావు హాజరై ఆయా పార్టీల పార్లమెంట్ బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

బహిరంగ సభలతో బలం చూపియ్యాలే..

అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్టీ అగ్రనేతల బహిరంగ సభలు పెద్ద ఎత్తున నిర్వహించాయి. వేల సంఖ్యలో జనసమీకరణ చేసి సక్సెస్ చేశారు. అయితే, ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బహిరంగ సభలు నిర్వహించడం పార్టీలకు సవాల్ గా మారింది. జన సమీకరణ చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారానికి జనాలను తరలించాలంటే ఖర్చులు పెరిగే అవకాశం లేకపోలేదు.