గుండె, ఊపిరితిత్తుల మధ్య దిగిన బాణం.. ఆపరేషన్‌‌ చేసి తీసిన నిమ్స్ డాక్టర్లు

గుండె, ఊపిరితిత్తుల మధ్య దిగిన బాణం..  ఆపరేషన్‌‌ చేసి తీసిన నిమ్స్ డాక్టర్లు

సక్సెస్‌‌ఫుల్‌‌గా 

     ప్రాణాలతో బయటపడిన చత్తీస్‌‌గఢ్ ఆదివాసీ యువకుడు
     ప్రత్యేక కేసుగా పరిగణించి ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ చేసిన నిమ్స్

పంజాగుట్ట, వెలుగు: ప్రమాదవశాత్తు గుండె, ఊపిరితిత్తులకు మధ్య దిగిన బాణాన్ని నిమ్స్‌‌‌‌ డాక్టర్లు ఆపరేషన్‌‌ చేసి తొలగించారు. చత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్ జిల్లా ఉసుర్ ప్రాంతానికి చెందిన సోది నంద(17) అనే ఆదివాసీ యువకుడి శరీరంలోకి మూడ్రోజుల క్రితం బాణం దూసుకుపోయింది. వెంటనే చికిత్స కోసం కుటుంబసభ్యులు భద్రాచలం ఏరియా హాస్పిటల్‌‌కు తీసుకువెళ్లారు. అక్కడ మెరుగైన చికిత్స అందకపోవడంతో.. వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ జరుగుతుండగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌‌లోని నిమ్స్ ఆసుపత్రికి శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. 

కార్డియోథోరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర్‌‌‌‌ రావు, డాక్టర్ గోపాల్ ఆ యువకుడిని పరీక్షించి, గుండె, ఊపిరితిత్తుల మధ్య నుంచి బాణం లోపలకు చొచ్చుకుపోయినట్టు గుర్తించారు. సుమారు 4 గంటల పాటు శ్రమించి యువకుడి శరీరంలోని బాణాన్ని తొలగించారు. ప్రసుత్తం అతను ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు శనివారం మీడియాకు తెలియజేశారు. కాగా, యువకుడి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కేసుగా పరిగణించి అతనికి ఉచితంగా ట్రీట్‌‌మెంట్‌‌ అందించామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఈ సందర్భంగా యువకుడి ప్రాణాలు కాపాడిన వైద్యలను ఆయన అభినందించారు.