అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌పై అభిమానుల తీవ్ర విమర్శలు

 అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌పై అభిమానుల తీవ్ర విమర్శలు

క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేసిన యంగ్‌‌ పేసర్‌‌పై సోషల్‌‌ మీడియాలో దాడి
ఇండియన్‌‌ కాదు ఖలిస్తానీ అంటూ హేళన.. ఖండించిన మాజీ ప్లేయర్లు

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌‌తో సూపర్‌‌4 మ్యాచ్‌‌లో ఆసిఫ్‌‌ అలీ ఇచ్చిన క్యాచ్‌‌ను డ్రాప్‌‌ చేసిన ఇండియా యంగ్‌‌ పేసర్‌‌ అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌పై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇండియా ఓటమికి అతనే కారణమని తిడుతున్నారు. సోషల్‌‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌‌ చేస్తున్నారు. కొందరు హద్దులు దాటి. అర్ష్‌‌దీప్‌‌ ఇండియన్‌‌ కాదు.. ఖలిస్తానీ అంటు హేళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అర్ష్‌‌దీప్‌‌ వికీపిడియా పేజీని హ్యాక్‌‌ చేశాడు. ఆ పేజీలో ఇండియా ఉన్న చోట ఖలిస్తానీ అని ఎడిట్‌‌ చేశాడు. సదరు హ్యాకర్‌‌ యువ బౌలర్ పేరును మేజర్‌‌ అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ లంగ్రా.. తర్వాత మజర్‌‌ అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ బజ్వా అని మార్చాడు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో వికీపిడియా పేజీని సరిచేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్‌‌, టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్‌‌ చంద్రశేఖర్‌‌.. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.  వికీపిడియా నుంచి వివరణ కోరారు. మరోవైపు అర్ష్‌‌దీప్‌‌కు టీమిండియా ప్లేయర్లు, మాజీలు బాసటగా నిలిచారు. ఇలాంటి ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్‌‌లో తప్పులు జరగడం సహజమేనని కోహ్లీ అన్నాడు. కెరీర్‌‌ ఆరంభంలో తాను కూడా తప్పిదాలు చేశానని చెప్పాడు. అర్ష్‌‌దీప్‌‌ బంగారం లాంటి క్రికెటర్‌‌ అని, ఒక్క తప్పిదం వల్ల అతడిని హేళన చేయడం సిగ్గుచేటు అని మాజీ స్పిన్నర్‌‌ హర్భజన్‌‌ సింగ్‌‌ అన్నాడు. మాజీ పేసర్‌‌ ఇర్ఫాన్‌‌, పాక్‌‌ మాజీ క్రికెటర్ హఫీజ్‌‌తో పంజాబ్​ లీడర్లు కూడా అర్ష్‌‌దీప్‌‌ కు సపోర్ట్‌‌ ఇచ్చారు.