‘ఆర్టికల్ 15’.. అందరికీ సమానమేనా ?

‘ఆర్టికల్ 15’.. అందరికీ సమానమేనా ?

నువ్వెవరు ? ఈ ప్రశ్నకి ఎవరైనా ఏం జవాబు చెప్తారు?  మనిషిననా? అమ్మాయినో అబ్బాయినో అనా? ఉద్యోగినో నిరుద్యోగినో అనా?  వివాహితుడినో అవివాహితుడినో అనా?  ప్రశ్నకి జవాబు చెప్పాలంటే ఇవేనా ఆప్షన్స్? యస్ .. వేరే ఏ దేశంలో అయినా ఇవే ఆప్షన్స్.  కానీ మన దేశంలో మరో ఆప్షన్ కూడా ఉంది. అదే.. పేరు చివర తగిలించే కులం. ఎక్కడా ఏ దేశంలోనూ కనిపించని ట్యాగ్‌లైన్‌ మన దేశంలోని ప్రతి పౌరుడికీ ఉంటుంది. నిజానికి అది గుర్తింపు కాదు. ఒక రకమైన వేధింపు.నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అంటూ మనలో మనల్నే విభిజిస్తుంది.నువ్వు మనిషివనే సంగతిని విస్మరించి నీ ప్రతి హక్కునూ తస్కరిస్తుంది .నిన్ను అంటరానివాడిని చేస్తుంది. ఒంటరివాడిని చేస్తుంది.నిన్ను నిన్నుగా ఉండనివ్వనంటుంది. నీ నీడను సైతం నీకు శత్రువుగా మారుస్తుంది. ఈ నిజం అయాన్‌ రంజన్‌కి ఆలస్యంగా తెలిసింది.అతను పెద్ద కులంలోనే పుట్టాడు. కానీ పెద్ద, చిన్న అనే తేడా తెలియకుండా పెరిగాడు.మానవత్వాన్ని మించిన కులం లేదని మనస్ఫూర్తిగా నమ్మాడు. అందుకే.. ‘ఆర్టికల్ 15’ని సరిగ్గా అర్థం చేసుకోగలిగాడు. అందరికీ కూడా అర్థమయ్యేలా చేయాలనుకున్నాడు.చేయగలిగాడా? అందరినీ కాకపోయినా.. కనీసం ఒక్కరినైనా మార్చగలిగాడా? దీనికి సమాధానం... బహుశా ఇప్పటికీ ఎప్పటికీ మౌనమే!

సినిమా కథేంటంటే..

కొన్ని గమనాలు చివరికి ఏ గమ్యానికి చేరుకుంటాయో చెప్పడం కష్టం. తనలో ఉండే కొన్ని లక్షణాలు ఏ మనిషిని ఏ లక్ష్యంవైపు నడిపిస్తాయో చెప్పడమూ కష్టం. అయాన్ ప్రయాణం అలాంటిదే. అతనో ఐపీఎస్ ఆఫీసర్. నిజాయతీపరుడు. నిప్పులాంటివాడు. ఇలాంటివాళ్లు అందరికీ శత్రువులే. అందుకే కొందరికి టార్గెట్ అయ్యాడు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని లాల్‌గావ్‌కి అడిషనల్ ఎస్పీగా వచ్చీ రావడంతోనే షాకుల మీద షాకులు తగులుతాయతనికి. అయాన్‌కి తగిలిన మొదటి కేసు.. ముగ్గురమ్మాయిల మిస్సింగ్. వారిలో ఇద్దరు ఒకరోజు ఉదయాన్నే ఓ పెద్ద చెట్టుకు వేళ్లాడుతూ కనిపించారు.. శవాలుగా. ఏమైంది అంటే.. ఇద్దరూ తప్పుదారి పట్టారన్నారు. ఒకరికొకరు ఆకర్షితులై సంబంధం పెట్టుకున్నారని, పేరెంట్స్ కి  తెలిసి కోప్పడటంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వాళ్లు చెప్పడమే కాదు.. ఆ తల్లిదండ్రులతోటీ చెప్పించారు.  అది అబద్ధమని అయాన్‌కి తెలిసిపోయింది.  మూడు రూపాయల కూలి పెంచమని అడిగినందుకు ఓ బడాబాబు ముగ్గురమ్మాయిల్ని ఎత్తుకుపోయాడు. దారుణంగా చెరిచాడు. పదే పదే హింసించాడు. చివరికి ఇద్దరి ప్రాణాలు తీసేసి ఉరితాడుకి వేళాడదీశాడు. రక్తం మరిగిపోయింది అయాన్‌కి. గుప్పిట్లో పెట్టి నలిపినట్టుగా గుండె విలవిల్లాడింది.  ఒక పోలీసుగానే కాదు, వ్యక్తిగా కూడా ముందుకి కదలాలని, ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు. కనిపించకుండా పోయిన మూడో అమ్మాయిని వెతకడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఎన్నో ఆటంకాలు. అవమానాలు. తన డిపార్ట్మెంట్‌లో వాళ్లే అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని, కుల మత భేదాల్ని ప్రోత్సహిస్తున్నారని తెలిసినా ఒంటరిగా పోరాడాడు. ఉద్యోగమే పోయే పరిస్థితి వచ్చింది. అయినా ఆగలేదు. పై అధికారుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. తల వంచలేదు. జవాబు చెప్పాడు. మాటలతోనే కాదు.. చేతలతో కూడా. చావుబతుకుల్లో ఉన్న ఆ మూడో అమ్మాయిని వెతికి పట్టుకున్నాడు. నిజానిజాల్ని అందరి ముందుకీ తీసుకొచ్చాడు. అనుకున్నది సాధించాడు.

నీకు న్యూట్రల్‌గా ఉండటం రాదా?

న్యూట్రల్‌గా ఉండటమంటే ఏంటి సర్.. నిప్పు రాజుకుంటుంటే ఆ నిప్పు పెట్టినవాడికి అండగా నిలబడటమా? ఇది ఆనర్ కిల్లింగ్ కేసులానే కనిపిస్తోంది. క్లియర్ కట్ ఓపెన్ అండ్ షట్ కేసు కదా? కాదు సర్.. మూడు రూపాయలు ఎక్కువ అడిగారని ముగ్గురమ్మాయిల్ని రేప్ చేశారు. కేవలం మూడు రూపాయలు. మీరు తాగుతున్న మినరల్ వాటర్‌‌లోని మూడు చుక్కలతో సమానమది. అయినా ఎందుకు చేశారో తెలుసా.. నీ స్థాయి ఇది అని చెప్పడానికి. వాళ్లలో ఇద్దరమ్మాయిల్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఎందుకో తెలుసా.. వాళ్ల స్థాయి ఇది అని సమాజం మొత్తానికీ చెప్పడానికి. ఈ దారుణాల్ని పోలీస్‌ స్టేషన్‌ ద్వారా ఆపొచ్చు. కానీ ఆపలేదు. ఎందుకంటే వాళ్లకి ఇలాగే జరగాలి అని అందరూ భావిస్తున్నారు కాబట్టి. తనపై ఎంక్వయిరీ కమిషన్ వేసినప్పుడు, తనని ప్రశ్నించడానికి వచ్చిన పై అధికారికి, అయాన్‌కి మధ్య జరిగే సంభాషణ ఇది. మనసు ఉండాలే కానీ.. ఆ సమయంలో అయాన్ మాట్లాడే ప్రతి మాటా తూటాలా వచ్చి మన మనసుని చీల్చేస్తుంది. ‘నేను మా నాన్న కోసం ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను. కానీ మీరు అలా కాదు. మీకు హిందీ భాషంటే ప్రేమ. దేశమంటే ఇంకా ప్రేమ. మరి నాకు రెండు రోజుల్లో అర్థమైంది మీకు ఇన్నేళ్లలో అర్థం కాలేదా సర్? లేదంటే మీ దృష్టిలో వీళ్లు అసలు మన దేశంలో భాగమే కాదంటారా?’ అని ప్రశ్నిస్తున్నప్పుడు అది మనల్నే అడుగుతున్నాడా అన్నట్టు చురుక్కుమనదా? ‘ఇక్కడ ఎవరికీ ఏదీ గుర్తుండదు.. తమ పవర్ తప్ప. నేనా అమ్మాయిని కాపాడటానికి ఏమైనా చేస్తాను. ఇల్లీగల్ అనిపిస్తే అరెస్ట్ చేసుకోండి’ అని చెబుతున్నప్పుడు ఈ తెగువ మనలోనూ ఉండాలేమో కదా అని మన మెదడు క్షణమైనా ఆలోచించదా? 

ఆయుష్మాన్ నటన వల్లనే..

ఇక హీరో  ఆయుష్మాన్‌ అది ఏ పాత్ర అని చూడడు.. ఎలాంటి పాత్ర అని మాత్రమే చూస్తాడు. ఒకవేళ దర్శకుడు అతన్ని ఒక నిమ్న కులస్థుడిగా నటించమంటే కచ్చితంగా నటించి ఉండేవాడు. కానీ అనుభవ్ ఆలోచన వేరు. యాతన పడుతున్న ఓ గుంపులో నుంచి ఒకడు బైటికొచ్చి ఇది మా వేదన అని చెప్పడంలో గొప్పేముంది? వెతలకు గురి చేస్తున్న గ్రూపులో నుంచి ఒకడు ముందుకొచ్చి ఇది తప్పు అని చెప్పడంలోనే ఉంది కిక్కు. అలా చేయడం వల్లనే ఆయన ఆలోచనకి సార్థకత చేకూరిందనడంలో సందేహం లేదు. ‘జన గణ మన’ అని పాడుకుంటున్నామే కానీ ఆ జనంలో మేము లేము, ఆ గణంలో మమ్మల్ని చేర్చుకోరు అంటూ ఓ అమాయకుడు ఆవేదన చెందుతుంటే దాని తాలూకు బాధ హీరో కళ్లల్లో కదలాడుతుంది. చెట్టుకు వేళ్లాడుతున్న ఆడపిల్లల శవాలను చూసి అతని మనసు కొన్ని రోజుల పాటు గాలిలో దీపంలా రెపరెపలాడుతుంది. ఆ వేదన అనుభవించినవాడికే తెలుస్తుంది. కానీ చూస్తున్న ప్రేక్షకుడికి కూడా తెలిసిందంటే, అతని కళ్లల్లోనూ తడి చేరిందంటే అది ఆయుష్మాన్ ప్రదర్శించిన అద్భుతమైన నటన వల్లనే. ఉన్నతమైన ఆలోచనలు గల దర్శకుడు.. అత్యున్నతమైన ప్రతిభ కలిగిన కథానాయకుడు కలిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయో చెప్పడానికి ఈ సినిమాయే గొప్ప ఉదాహరణ.

ఇలాంటి సినిమాల గెలుపు ఎప్పుడూ ఆగదు

2014లో యూపీలోని బదావూలో జరిగిన సంఘటనని న్యూస్‌ పేపర్‌‌లో చూశాడు అనుభవ్ సిన్హా. చెట్టుకు వేళ్లాడుతున్న అమ్మాయిల శవాలు అతనిని కుదురుగా ఉండనివ్వలేదు. కళ్లు మూసినా తెరిచినా ఆ దృశ్యమే వెంటాడసాగింది. దాని వెనుక ఉన్న కఠోర వాస్తవం అతన్ని చాలా వేధించింది. అదే ఈ సినిమా తీయడానికి ప్రేరేపించింది.  ఇలాంటి డ్రై సబ్జెక్ట్ని ఆకట్టుకునేలా చెప్పాలంటే కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకోక తప్పదు. అయితే అది లిమిట్స్ దాటకపోవడమే అనుభవ్ మేకింగ్‌లోని గొప్పదనం. ఆకాశానికి ఎగిరేంత స్వేచ్ఛ కొందరికి ఉంది. కానీ నేలపై నిలబడటానికి కూడా కొందరికి అవకాశం లేకుండా పోతోంది. అర్హతను మించిన ఆదాయం కొందరికి అందుతోంది. కానీ కష్టానికి తగినంత ఫలితం కూడా కొందరికి అందకుంది. ఈ అసమానతను రూపుమాపడం తనవల్ల కాకపోవచ్చు. కానీ ఇది అన్యాయం అని చెప్పడం తనవల్ల అవుతుందనుకున్న ఓ సిన్సియర్‌‌ ఫిల్మ్ మేకర్‌‌ వినిపించిన స్వరం ఈ చిత్రం. దీన్ని తప్పుబట్టడం నిజంగా విచిత్రం. అన్యాయానికి గళం పెద్దదే కావచ్చు. కానీ న్యాయం గొంతు విప్పినప్పుడు వచ్చే శబ్దం ముందు అది చిన్నబోక తప్పదు. అందుకే ఇలాంటి సినిమాల గెలుపు ఎప్పుడూ ఆగదు. ఆగివుంటే.. ఇవాళ ‘ఆర్టికల్ 15’ గురించి మనం మాట్లాడుకునే అవసరమే ఉండేది కాదు.

అనుభవ్ సిన్హాని ఎంత మెచ్చుకున్నా తక్కువే

ఈ రోజుల్లో తన సినిమాలో కులాల ప్రస్తావన తెచ్చే ధైర్యం ఏ దర్శకుడికి ఉంది? మనోభావాలు దెబ్బ తింటాయని భయం. సెన్సార్ దగ్గర చిక్కులు వస్తాయేమోనని భయం. వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం చేసినందుకు అనుభవ్ సిన్హాని ఎంత మెచ్చుకున్నా తక్కువే. పట్టణాల్లో.. ఖరీదైన బంగ్లాల్లో.. క్షణం తీరిక లేని జీవితాల్లో పడి కొట్టుకునే మనకి.. ఎక్కడో యూపీలోనో బీహార్‌‌లోనో ఇప్పటికీ కొందరు మూడు రూపాయల కూలి కోసం మానప్రాణాలు కోల్పోతున్నారనే విషయం తెలియదు. అది తెలుసుకున్నందుకు అతణ్ని మెచ్చుకోవాలి. ఆ అరాచకాన్ని ధైర్యంగా అందరి ముందుకీ తీసుకొచ్చినందుకు ప్రశంసించాలి. తమని టార్గెట్ చేశారంటూ కొందరు థియేటర్లు తగలబెడుతుంటే.. థియేటర్లని కాదు, మీలో ఉన్న మూఢాచారాల్ని, అధికులమనే అహంకారాన్ని తగలబెట్టండి అంటూ వాయిస్ రెయిజ్‌ చేసినందుకు సత్కరించాలి.