
- లడఖ్ ను యూటీగా చేయడం చట్టవిరుద్ధమంటూ కామెంట్
- భారత సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోమని ప్రకటన
బీజింగ్: జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై భారత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని పేర్కొంది. అలాగే, లడఖ్ ను యూటీగా ఏర్పాటు చేయడాన్ని సైతం తాము గుర్తించట్లేదని పేర్కొంది. లడఖ్ యూటీని భారత్ చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిందని ఆక్షేపించింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే సమర్థించింది. అలాగే, లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా రూపొందించాలని కూడా సూచించింది. కాగా, ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మేము గుర్తించడం లేదు.
భారత సుప్రీంకోర్టు తీర్పుతో సరిహద్దు పశ్చిమ భాగం చైనాకు చెందిందన్న వాస్తవ పరిస్థితిని మార్చలేం. లడఖ్ ప్రాంతం ఎప్పటికీ మా భూభాగంలో భాగమే’’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై పాకిస్తాన్ స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడాన్ని అంతర్జాతీయ చట్టం గుర్తించలేదని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ ప్రకటన రిలీజ్చేశారు. కాశ్మీరీ ప్రజలతో పాటు పాకిస్తాన్ అభీష్టానికి వ్యతిరేకంగా ఈ వివాదాస్పద భూభాగం హోదాపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే హక్కు భారతదేశానికి లేదని జిలానీ అన్నారు.