- అరుణోదయ సాంస్కృతిక గౌరవధ్యక్షురాలు విమలక్క
నకిరేకల్, వెలుగు: పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి చండ్ర పుల్లారెడ్డి అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. భారత విప్లవోద్యమ అగ్రనేత చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సభకు కమిటీ నాయకుడు బొమ్మకంటి కొమరయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన సభలో విమలక్క, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, న్యాయవాది కట్టా భగవంత రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి చండ్ర పుల్లారెడ్డి అన్నారు. న్యాయవాది కట్టా భగవంత రెడ్డి మాట్లాడుతూ... ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంబటి నాగయ్య మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. రైతు-కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పట్లోళ్ల నాగిరెడ్డి, వెల్తూరు సదానందం, అరుణోదయ సమాఖ్య అధ్యక్షుడు మల్సూర్ పాల్గొన్నారు.
