మోదీకి థ్యాంక్స్.. అమిత్ షాకు రుణపడి ఉంటా : ధర్మపురి అరవింద్

మోదీకి థ్యాంక్స్.. అమిత్ షాకు రుణపడి ఉంటా  :  ధర్మపురి అరవింద్

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు  చేస్తున్నట్లు  ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల బీజేపీ నేత,  నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.  ఈ మేరకు ట్విట్టర్ లో వీడియోను రిలీజ్ చేశారు.  బోర్డు కార్యాచరణ దాల్చడంలో  కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు  ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు.  ఈ కార్యక్రమంలో చొరువతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ , జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్,  రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  

2014 తర్వాత దేశంలో పసుపు ఎగుమతి రెట్టింపైందని మహబూబ్ నగర్ ప్రజా గర్జన సభలో మోదీ అన్నారు. కానీ, పసుపు లాంటి బంగారు దినుసులను పండించే రైతులను ఆదుకునేందుకు బోర్డు లేదని, అందుకే  వారికి ఒక గొప్ప కానుక అందిస్తున్నానని చెప్పారు. దేశంలోనే ప్రత్యేకమైన పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణకు మంజూరు చేస్తున్నామని చెప్పిన మోదీ. ఇది రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని పసుపు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.